శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 17:32:52

చిట్టడివిని సృష్టించాం : మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి

చిట్టడివిని సృష్టించాం : మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి

  • లక్కారంలో తంగేడు వనం ప్రారంభం
  • వెయ్యికి పైగా మొక్కలు వాకింగ్‌ ట్రాక్‌తో పార్కు నిర్మాణం

చౌటుప్పల్‌ : అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు వెయ్యిరకాల మొక్కలు, చెట్లతో చిట్టడివిని సృష్టించామని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ పట్టణ పరిధి లక్కారం గ్రామంలో ఆటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదాద్రి మోడల్‌ న్యాచురల్‌ పార్కు (తంగేడు వనం)ను గురువారం వారు ప్రారంభించి మాట్లాడారు.  ఈ సందర్భంగా విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ దీన్ని తంగేడు వనం అనే కంటే అడవి అనొచ్చన్నారు.  ఇందులో కొద్ది భాగాన్ని మత్రమే పార్కులాగా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అన్నిచోట్ల కూడా ఇలాంటి మోడల్‌ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండలో అటవీ భాగం తక్కువగా ఉందని, సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో ప్రజలందరు ఉద్యమంలా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 33శాతం ఉన్న అడవులు 20 శాతానికి తగ్గాయని, ప్రజలు మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పార్కులు అన్ని చోట్లా నిర్మిస్తామని, హైదరాబాద్‌లోనే 60 అర్బన్‌ పార్కులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అనంతరం మంత్రులు పార్కులో తిరిగి బటర్‌ఫ్లై, వాకింగ్‌ ట్రాక్‌, తంగెడు వనం, వ్యూ పాయింట్‌ను సందర్శించారు. వారి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులున్నారు. 


logo