గురువారం 21 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 19:32:14

'అభివృద్ధి మేం తెస్త్తామంటే.. కర్ఫ్యూ వాళ్లు తెస్తామంటున్నారు'

'అభివృద్ధి మేం తెస్త్తామంటే.. కర్ఫ్యూ వాళ్లు తెస్తామంటున్నారు'

హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు అభివృద్ధిని మేం తెస్తామంటుంటే బీజేపీ వాళ్లు హిందు-ముస్లిం పంచాయతీ, కర్ఫ్యూలు తెస్తామంటున్నరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఈ సాయంత్రం ఉప్పల్‌ నియోజకవర్గంలోని ఈసీఐఎల్‌ చౌరస్తాలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఏఎస్‌రావు నగర్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి పావనీరెడ్డి, కాప్రా నుంచి స్వర్ణారాజ్‌, చర్లపల్లి నుంచి బొంతు శ్రీదేవిని భారీ మెజార్టీతో గెలిపించి బల్దియాకు పంపాల్సిందిగా కోరారు. 

పనిచేసి చూపిస్తాం ఓటేయండని ఐదేళ్ల కిందట వచ్చి అభ్యర్థించాం. చేసిన పనులను చెబుతూ చేయబోయే పనులను కూడా చెబుతూ ఈసారి ఓట్లు అభ్యర్థిస్తున్నామన్నారు. మరి బీజేపీ వాళ్లు ఏం చేసినరో.. ఏం చేస్తరో చెప్పమంటే మాత్రం చెప్పారు. హిందువులను, ముస్లింలను రెచ్చగొట్టాలే, పంచాయతీ పెట్టాలే ఇదే వాళ్ల అజెండా అన్నారు. ఆనాడు మంచినీటికి ఎంత గోస ఎట్లుండెనో యాది చేసుకోండి. ఉప్పల్‌ నియోజకవర్గంలో మంచినీళ్ల సమస్య తీర్చేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టామన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో నీళ్లు, కరెంటు సమస్య తీర్చుకున్నాం. హైదరాబాద్‌ను ఆరేండ్లలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చినం. తెలంగాణలో పేదవాడు సంతోషంగా ఉన్నడా లేడా ఆలోచించాల్సిందిగా కోరారు. పింఛన్లు, ఆరు కిలోల బియ్యం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అన్నపూర్ణ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, ఎల్‌ఈడీ లైట్లు, సీసీ టీవీ కెమెరాలు ఇలా ప్రతీ రంగంలో అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉప్పల్‌ ప్రాంతాంలో ఐదు ఐటీ పార్కులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. 

డజన్‌ కేంద్ర మంత్రులు, పక్కరాష్ర్టాల ముఖ్యమంత్రులు వస్తున్నరట. వారందరికి హైదరాబాద్‌కు స్వాగతం. కానీ వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకండి. సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసిన రూ. 1350 కోట్లు తీసుకురావాలన్నారు. మాయమాటలు చెబుతున్న పార్టీలు ఈ నగరానికి ఏం చేసిండ్రో ఆలోచించాలన్నారు. అభివృద్ధి మేం తెస్తమంటే వాళ్లేమో హిందు-ముస్లిం పంచాయతీ తెస్తామంటున్నరు. చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నరు. కనిపెట్టుకుని ఉండాల్సిందిగా సూచించారు. పేదవారిని కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వమే మనకు అండగా ఉంటదన్నారు. వాళ్లతోని ఊదు కాలది.. పీరు లేవది.. మళ్లా తెలంగాణ ముందుకు పోవాలంటే.. హైదరాబాద్‌ పచ్చగుండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే.. కంపెనీలు రావాలంటే.. మన పిల్లలకు కొలువులు రావాలంటే.. మన బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ వల్లే తప్ప ఈ పొలిటికల్‌ ట్విస్ట్‌ల వల్ల కాదని కేటీఆర్‌ పేర్కొన్నారు. 


logo