బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 13:34:14

నిబద్ధతతో పనిచేస్తున్నాం.. ఆశీర్వదించండి: మంత్రి కేటీఆర్‌

నిబద్ధతతో పనిచేస్తున్నాం.. ఆశీర్వదించండి: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నామని, మరోమారు ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు. బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారని అనుమానాలు వ్యక్తంచేశారని తెలిపారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో కరెంట్‌ కోతలకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్‌ సమస్యను తీర్చామన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందుందని చెప్పారు. అత్యధిక విద్యుత్‌ వినియోగం అభివృద్ధికి సూచిక అని వెల్లడించారు.  

మంచి నీటి సమస్యను పరిష్కరించాం

పేదలకోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, మనందరి కోసం పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు రెట్టింపు చేశామని తెలిపారు. సామాన్యుల వైద్యం కోసం బస్తీ దవాఖానలు ప్రారంభించామని చెప్పారు. అన్నపూర్ణ క్యాంటీన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలు అమలుచేస్తున్నామన్నారు. మంచినీటి సమస్యను 95 శాతం పరిష్కరించామని చెప్పారు. ప్రసూతి, శిశు మరణాల రేటును తగ్గించడంలో తెలంగాణ సఫలమయ్యిందన్నారు. ఫ్లైఓవర్లు, లింక్‌రోడ్లు, అండర్‌పాస్‌లు, కొత్త రోడ్లతో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌పెడుతున్నామని తెలిపారు. 

పరిశ్రమలకు ఇన్సెంటివ్‌లు

రోజుకు 2 సెంటీమీటర్లకు మించి వర్షం పడితే హైదరాబాద్‌ జలమయం అవుతున్నదని, డ్రైనేజీ, సీవేజి వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతున్నదని చెప్పారు. త్వరలో నాలాలు విస్తరించి ముంపు సమస్యకు పరిష్కరిస్తామన్నారు. ముంబై సహా దేశంలోని అన్ని నగరాల్లో వరద సమస్య ఉందని చెప్పారు. పట్నాలో బీజేపీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ వరదల్లో చిక్కుకుంటే బోట్లో తీసుకొచ్చారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఆధునిక వాహనాలతో చెత్త సేకరిస్తున్నామని, ఆ చెత్త నుంచి విద్యుత్‌, ఎరువులు తయారు చేస్తున్నామని వెల్లడించారు. నగరంలో ఐదు లక్షలకుపైగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా కొనసాగుతున్నదని చెప్పారు. రెండు మూడేండ్లలో మూసీ నది సుందరీకరణ పూర్తవుతుందని ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌లో పరిశ్రమలకు ఇన్సెంటివ్‌లు ఇస్తామని ప్రకటించారు. నిబద్ధతతో అభివృద్ధిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

ఆ పార్టీలు కూలుస్తామంటున్నాయి.. 

బీజేపీ మత విద్వేషాలతో లబ్ధిపొందాలని చూస్తున్నదని కేటీఆర్‌ ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎం కూల్చివేస్తామంటున్నాయి కానీ.. నిర్మిస్తామనడం లేదని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కేంద్రం నుంచి ఒక్కపైసా తీసుకురాలేదని విమర్శించారు. గత ఆరేండ్లలో తెలంగాణ రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి పన్నులు కట్టిందనీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి తిరిగిచ్చింది రూ.1.4 లక్షల కోట్లేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా సమయంలో ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల ప్యాకేజీలో ఇక్కడెవరికీ పైసా లేదని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల 8 క్వార్టర్లు ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందన్నారు.  

ఆధార్, ఓటర్‌ ఐడీ ఇచ్చింది కేంద్రమే

పాతబస్తీలో రోహింగ్యాలున్నారని బీజేపీ ప్రచారం చేస్తున్నదని, హైదరాబాద్‌ రోహింగ్యాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రోహింగ్యాలకు ఆధార్‌, ఓటర్‌ ఐడీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి అగర్వాల్‌, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ కమ్యూనిటీ వ్యాపారులు హాజరయ్యారు. 


logo