e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home తెలంగాణ మేమంతా కేసీఆర్‌ వెంటే

మేమంతా కేసీఆర్‌ వెంటే

మేమంతా కేసీఆర్‌ వెంటే
  • అభివృద్ధికి జై కొడుతున్న హుజూరాబాద్‌ ప్రజలు
  • పార్టీని వీడే ప్రశ్నేలేదంటున్న ప్రజాప్రతినిధులు
  • ఈటలను దూరం పెడుతున్న సన్నిహితులు
  • బాహాటంగా బయటకు వచ్చిన మున్సిపల్‌ చైర్మన్లు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈటల అక్రమాలు, భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండడంతో ప్రజలు, ప్రజాప్రతినిధులంతా ఆయన్ను వీడుతున్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్‌ వెంటే ఉంటామంటూ కదలివస్తున్నారు. మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, మార్కెట్‌ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు మొదలుకొని సబ్బండ వర్గాల వరకు అందరూ టీఆర్‌ఎస్‌ వెంటే నడుస్తామని తీర్మానం చేస్తున్నారు.

కరీంనగర్‌, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఎదురుదెబ్బలు తప్పట్లేదు. ఈటల అక్రమాలు, భూ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండడంతో.. ప్రజలు, ప్రజాప్రతినిధులంతా ఆయన్ను వీడుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యమిచ్చి ఈటలకు అనేక పదవులను కట్టబెట్టినా.. వాటికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించారని ఆయన సన్నిహితులే బాహాటంగా విమర్శిస్తున్నారు. పార్టీ నియమ నిబంధనలను మరిచి.. ఈటల మాట్లాడిన మాటలు.. రైతు బంధు, కల్యాణలక్ష్మి వంటి అద్భుతమైన పథకాల వంటి వాటిలో వ్యవహరించిన తీరే ఆయన్ను దూరం చేశాయని విమర్శిస్తున్నారు. కాగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్‌ వెంటే మేము ఉంటామంటూ కదలి వస్తున్నారు. ‘అభివృద్ధే మా అజెండా.. కేసీఆరే మాకు అండ’ అంటూ ఏకంగా తీర్మానాలు చేస్తున్నారు. మున్సిపల్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, మార్కెట్‌ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు మొదలుకొని సంబండవర్గాల వారు ఈటలను వీడి టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటే నడుస్తామంటూ తీర్మానం చేస్తున్నారు.

వ్యక్తులు కాదు.. పార్టీయే ముఖ్యం


వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, తామంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటామని జమ్మికుంట ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు వెల్లడించారు. శుక్రవారం వారు కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, సీఎం కేసీఆర్‌ వెంటే నడుస్తామని పునరుద్ఘాటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ 20 ఏండ్లుగా అనేక పదవులు అనుభవించి తల్లిలాంటి పార్టీని విమర్శించడం దారుణమని, టీఆర్‌ఎస్‌ను చీల్చేందుకు కుట్ర పన్నినట్లు అర్థమవుతున్నదని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేకులైన బీజేపీ, కాంగ్రెస్‌తో ఈటల చేసుకున్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైందన్నారు. సమావేశంలో జమ్మికుంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటరెడ్డి, సర్పంచ్‌ మహేందర్‌, జమ్మికుంట కౌన్సిలర్‌ మారేపల్లి భిక్షపతి, చిదురాల రామస్వామి, పెద్దపల్లి సర్పంచ్‌ రాజు, జమ్మికుంట మాజీ ఎంపీపీ నేరెళ్ల రాజమౌళి, కోరెపల్లి మాజీ సర్పంచ్‌ బోయిన సమ్మయ్య పాల్గొన్నారు.

అభివృద్ధికి అండగా నిలుస్తాం


కేసీఆరే నాయకత్వమే తమకు, రాష్ర్టానికి శ్రీరామ రక్షని హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల పేర్కొన్నారు. శుక్రవారం వారు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో కలిసి హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ కన్నతల్లితో సమానమని, టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతామని స్పష్టంచేశారు. పట్టణాభివృద్ధికి కలిసి పని చేస్తామన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బర్మావత్‌ రమా, తాళ్లపల్లి శ్రీనివాస్‌, కల్లెపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, తోట రాజేంద్రప్రసాద్‌, తొగరు సదానందం, ముక్కపల్లి కుమార్‌, మెరుగు కొండాల్‌రెడ్డి, మంద ఉమాదేవి, ఉజ్మా నూరిన్‌, శివకుమార్‌, బర్మావత్‌ యాదగిరి, మారెపల్లి సుశీల, మొలుగు సృజన, పార్టీ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలే మాకు రక్ష


మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాత్రమే తమ నాయకుడని, ఆయన వెంటే నడుస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే ఉంటామని, పార్టీ నాయకుల ఆదేశాల మేరకు పనిచేస్తామని ఆయన స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో దేశంలో కనీవినీ ఎరుగని తరహాలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నాతోపాటూ కౌన్సిలర్లు పార్టీని వీడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రమంతా కేసీఆరేనని, ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. కేసీఆర్‌కు అండదండగా ఉంటామని, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అభివృద్ధి కోసం నిధులు అందిస్తున్నారని తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు ఎదురులేదు: కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు
హుజూరాబాద్‌టౌన్‌, మే 14: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని, పార్టీ టికెట్‌పై గెలిచిన ప్రతి ఒక్కరూ పార్టీ వెంటనే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ వీ లక్ష్మీకాంతారావు స్పష్టంచేశారు. హుజూరాబాద్‌ మండలం సింగాపురంలోని గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఆయనను టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మీరాంతనావే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై, మంత్రులపై ఈటల తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. తమ అధినాయకుడు సీఎం కేసీఆరేనని అందరూ ముఖం మీద కొట్టినట్టు చెబుతున్నప్పటికీ టీఆర్‌ఎస్‌పై బురద చల్లేందుకు ఈటల ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేత సామల రాజారెడ్డి, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆలేటి శ్రీరాం, టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా నాయకులు ఆకుల వెంకటేశ్‌, ప్రవీణ్‌ కూడా పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మేమంతా కేసీఆర్‌ వెంటే

ట్రెండింగ్‌

Advertisement