ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 19, 2021 , 01:49:47

ఈసారి బడ్జెట్‌లో 300 కోట్ల దాకా కేటాయింపు: వినోద్‌కుమార్

ఈసారి బడ్జెట్‌లో 300 కోట్ల దాకా కేటాయింపు: వినోద్‌కుమార్

  • ఖమ్మం, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నల్లగొండ వంటి సిటీల్లోనూ 
  • ద్వితీయ శ్రేణి నగరాలకూ ఓఆర్‌ఆర్‌లపై ఆలోచన చేస్తున్నాం
  • టీఆర్‌ఎస్‌ను విమర్శించే హక్కు కాంగ్రెస్‌, బీజేపీకి లేదు
  • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

హన్మకొండ, జనవరి 18: కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లాంటి నగరాలకు ఔటర్‌ రింగ్‌ రోడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గత కాంగ్రెస్‌, టీడీపీ పాలకులు తెలంగాణను విస్మరించారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఆయన స్పష్టంచేశారు. వరంగల్‌ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో భాగంగా సోమవారం 30వ డివిజన్‌లో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి రూ.2.50 కోట్ల అభివృద్ధి పనులకు వినోద్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పెద్దమ్మగడ్డ వాసులు ముందుండి స్ఫూర్తిగా నిలిచారని, సమైక్య పాలనలో కరెంటు, నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక నిర్ణయాలతో 24గంటల  విద్యుత్తుతోపాటు సరిపడా నీళ్లు వచ్చాయన్నారు. తద్వారా పంటల దిగుబడి పెరిగి గిట్టుబాటు ధరలు లభించడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసిందని చెప్పారు. రాష్ట్రంలో కోటి 50 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ సైతం తెలంగాణ పథకాలను అభినందించారని చెప్పారు. హైదరాబాద్‌, వరంగల్‌ల తరహా ద్వితీయ నగరాల్లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి  బడ్జెట్‌లో రూ.100 నుంచి రూ.300 కోట్ల వరకు కేటాయించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్‌, బీజేపీ ఇతర ఏ పార్టీలకు లేదన్నారు. అనంతరం చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. గత ఆరేండ్లలో వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గంలో రూ.232 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. అలాగే సీఎం రిలీఫ్‌ పండ్‌ కింద 108 మందికి రూ.70 లక్షల ఆర్థికసాయం అందజేశామని తెలిపారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే ఈ యాత్ర లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని దాస్యం స్పష్టం చేశారు. 


VIDEOS

logo