సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 21:28:32

ధాన్యం కొనుగోలుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం : మంత్రి జగదీశ్ రెడ్డి

ధాన్యం కొనుగోలుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం : మంత్రి జగదీశ్ రెడ్డి

నల్గొండ :  మిల్లర్లు సన్నరకం ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై మిల్లర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ, పోలీస్, సహకార శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడలో మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం వస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. నిత్యం 1500 ట్రాక్టర్ల ధాన్యం దిగుమతి చేసుకునే అవకాశం ఉండగా.. రెండు మూడురోజులుగా 3 వేల నుంచి 4 వేల ట్రాక్టర్లు వస్తుండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.

సన్న రకం ధాన్యంలో తేమశాతం 17 శాతం కంటే తక్కువగా ఉన్నా మిల్లర్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి చెప్పారు. 22, 23 శాతం ఉంటేనే మద్దతు ధర లభిస్తుందని అన్నది అపోహ మాత్రమేనని వెల్లడించారు. రాబోయే రోజుల్లో సన్నరకం ధాన్యం ధర పెరుగుతుందని రైతులు  ఓపికతో వ్యవహరించాలని సూచించారు. మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు టోకెన్లు జారీ చేయాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.

రోజు 1500 ట్రాక్టర్లకు టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. టోకెన్ ప్రకారం మిల్లుకు వెళ్లి సహకరించాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవీ రంగనాథ్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, గాదరి కిశోర్ కుమార్‌, నల్గొండ అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.