శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 13:51:02

కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నాం: మంత్రి ఈటల

కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నాం: మంత్రి ఈటల

మహబూబ్‌నగర్‌: వైద్యరంగంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రారంభంలో కొంత భయపడినా, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు.  అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ జిల్లా ఒకప్పుడు కరువు కాటకాలు, వలసలతో తల్లడిల్లిందని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. కరువు, వలసలతో బాధపడిన రాష్ట్రం నేడు దేశానికి ధాన్యాగారంగా మరిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ కృషివల్లే రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని వెల్లడించారు. 


ఇప్పుడు పట్నం పోవాల్సిన పనిలేదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సీఎంను అడిగి వెంటనే జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఆరేండ్లలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా చాలా అభివృద్ధి చెందింది. గతంలో ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పెద్ద దవాఖానాను నిర్మించుకున్నామని చెప్పారు. మూడేండ్లలోనే మెడికల్‌ కాలేజీకి పీజీ సీట్లు కూడా కేటాయించారని చెప్పారు. దాదాపు రెండు వందల మంది వైద్య సిబ్బందితో ప్రజలకు వైద్య సేవలు అందుతాయన్నారు. కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ దవాఖానలో వసతులు కల్పించామని తెలిపారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంపై తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి అన్నారు.


logo