మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 09, 2020 , 01:47:24

కరోనా కట్టడికి మేము సైతం..

కరోనా కట్టడికి మేము సైతం..

  • జైళ్లలో శానిటైజర్‌, మాస్కులతో కిట్లు 
  • మార్కెట్‌లో జీసీసీ శానిటైజర్లు 
  • మాస్కులు కుడుతున్న మహిళా సంఘాలు 
  • అత్యవసర సేవల్లో ఉన్నవారికి ఉచితం 
  • ఇప్పటికే 4.63 లక్షల మాస్కులు సరఫరా 
  • మహిళా సంఘాలకు మంత్రి కేటీఆర్‌ అభినందన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభు త్వం సర్వ శక్తులు ఒడ్డుతున్నది. ప్రజలు కొవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు తపిస్తున్నది. ఇందుకు మేము సైతం అంటూ మహిళా సంఘాలు, జైళ్లల్లో ఉన్న ఖైదీలు, గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) ముందుకొచ్చాయి. తమకు తోచిన రీతిలో సహాయసహకారాలు అందిస్తున్నాయి. సేవాభావంతో శానిటైజర్లు, మాస్కులు తయారుచేస్తూ తక్కువ ధరకే అందజేస్తున్నాయి. మహిళా సంఘా లు అత్యవసర సేవల్లో ఉన్న వైద్య, పోలీస్‌, పారిశుద్ధ్య సిబ్బందికి ఉచితంగా పంపిణీచేస్తున్నాయి.

జైళ్లశాఖ శానిటైజర్లు, మాస్కులు

తక్కువ ధరకు ప్రజలకు మాస్కులు అందించాలన్న లక్ష్యంతో శానిటైజర్లు, మాస్కులతో కూడిన కిట్ల తయారీపై చర్లపల్లి సెంట్రల్‌ జైలు ఖైదీలు దృష్టిపెట్టారు. ప్రతి కిట్‌లో రెండు లీటర్ల బ్లాక్‌ ఫినాయిల్‌ బాటిళ్లు, 300 ఎంఎల్‌ హ్యాండ్‌ శానిటైజర్లు రెండు, రెండు హ్యాండ్‌వాష్‌లు, రెండు సబ్బులు, ఖాదీతో చేసిన 12 మాస్కులతోపాటు ఇతర వస్తువులను ఉంచి రూ.900 చొప్పున విక్రయిస్తున్నట్టు జైళ్లశాఖ డీజీ రాజీవ్‌త్రివేది తెలిపారు. ఒకేచోట 15కు మించి కిట్లు ఆర్డర్‌చేస్తే మూడురోజుల్లో డెలివరీ చేస్తామని చెప్పారు. డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా డబ్బు చెల్లించాలని సూచించారు. మాస్కులు నూలు వస్త్రంతో చేసినవి కావడంతో సబ్బుతో ఉతికి, డెటాయిల్‌లో ముంచి ఆరవేసుకుంటే మరలా వినియోగించుకునేందుకు వీలుంటుంది. హైదరాబాద్‌లో కావాల్సినవారు 9866092127, 9494632100 లో సంప్రదించాలని కోరారు. చంచల్‌గూడ జైలుతోపాటు జిల్లా జైళ్లలోని కర్మాగారాల్లో ప్రత్యేక వస్త్రంతో కూడిన మాస్కులు తయారు చేస్తున్నారు.

పట్టణాల్లో సిద్ధమైన 2.5 లక్షల మాస్కులు

మున్సిపల్‌ ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసుల రక్షణకు అవసరమైన మాస్కుల తయారీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు అప్పగించింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న బృందాలు తయారు చేసిన మాస్కులను ఒక్కోటి రూ.10- రూ.14 చొప్పున మున్సిపాలిటీలు కొనుగోలు చేసేందుకు పురపాలనశాఖ డైరెక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ అనుమతులిచ్చారు. ఇప్పటికే 2.5 లక్షల మాస్కులు సిద్ధమవగా, 25 వేల మాస్కులను పారిశుద్ధ్య, ఆరోగ్య సిబ్బంది, 1.5 లక్షల మందికి అందజేశారు.

శానిటైజర్ల తయారీలో కంపెనీలు

శానిటైజర్లు, మాస్కులు, మందుల తయారీని ఫార్మా కంపెనీలు వేగవంతం చేశాయి. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు ఉత్పత్తిని పెంచాయి. వీటిని దవాఖానలు, వైద్య సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, వివిధ ప్రభుత్వశాఖలకు అందివ్వనున్నారు.  చాలా కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. 

అందుబాటులో జీసీసీ శానిటైజర్లు


గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేవారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) ద్వారా పలు వస్తువులను అందుబాటులోకి తెస్తున్నది. ఈ నేపథ్యంలోనే గిరి ప్రొడక్ట్‌ పేరిట జీసీసీ ద్వారా శానిటైజర్లను సిద్ధంచేశారు. మొత్తం 60 వేల బాటిళ్లు సిద్ధంచేయగా, 120 మిల్లీలీటర్ల బాటిల్‌ ధర రూ.50గా నిర్ణయించారు. సంక్షేమభవన్‌లోని ఉద్యోగులు వినియోగించేలా శానిటైజర్లు పంపిణీ చేసినట్టు గిరిజన సంక్షేమశాఖ జేడీ సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. అంగన్‌వాడీలకు 32 వేల బాటిళ్లను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.


మహిళా సంఘాల పెద్ద మనసు


మాస్కుల తయారీకి మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి. ఒక్కో సంఘం నుంచి కొంతమంది మహిళలను ఎంపిక చేసి వారి కి ముడి సరుకును సరఫరా చేస్తున్నారు. కొన్నిచోట్ల దాతలు కూడా ముందుకొచ్చి మహిళలకు ముడి సరుకు కొని ఇస్తున్నారు. దీంతో మహిళలు కష్టం, కూలీ ఆశించకుండా కుడుతున్నారు. అత్యవసర సేవల్లో ఉన్న సిబ్బందికి ఉచితంగా అందజేస్తున్నారు. రేషన్‌ దుకాణాలు, కూలీలకు కూడా ఉచితంగా ఇస్తున్నారు. కొన్నింటిని విక్రయిస్తున్నారు. ఒక్కో మాస్కు రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల వద్ద సిబ్బందికి కూడా ఉచితంగా అందజేయాలని ఆలోచిస్తున్నారు. రైతులకు మరింత తక్కువ ధరకు అమ్మాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు 4,63,878 సిద్ధం చేశారు. ఇంకా 13.56 లక్షల మాస్కులకు ఆర్డర్లు వచ్చాయి. ప్రస్తుతం జనగామ జిల్లా లో శానిటైజర్లు తయారు చేస్తున్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో తయారు చేయనున్నట్టు గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది. 

ప్రశంసించిన మంత్రి కేటీఆర్‌

మహిళా సంఘాలు మాస్కులు తయా రుచేయడం, అత్యవసర సేవల్లో ఉన్నవారికి ఉచితంగా పంపిణీచేయడం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసించారు. మహిళా సంఘాల ఔన్నత్యాన్ని అభినందించారు. నారాయణపేట జిల్లా కలెక్టర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. కేటీఆర్‌ స్పందించి ప్రశంసించారు.


logo