గురువారం 04 మార్చి 2021
Telangana - Dec 05, 2020 , 01:56:27

నిబంధనల ప్రకారమే వ్యవహరించాం

నిబంధనల ప్రకారమే వ్యవహరించాం

  • ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదు
  • స్వస్తిక్‌ మార్కు తీర్పుపై హైకోర్టులో ఎస్‌ఈసీ అప్పీల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 (జెడ్‌జీ) ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులు జోక్యం చేసుకోరాదని తెలిపింది. స్వస్తిక్‌ మార్కు సహా ఇతర ఏ మార్కులతో ఓట్లు పోలైనా వాటిని లెక్కించాలన్న ఎస్‌ఈసీ సర్క్యులర్‌ను పక్కనపెడుతూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం శుక్రవారం ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఎస్‌ఈసీ అప్పీల్‌ పిటిషన్‌ దాఖలుచేసింది. ఈ మధ్యంతర తీర్పును ఎత్తేయాలని కోరింది. ఇది ఎన్నికల ప్రక్రియపై జోక్యం చేసుకోవడమే అవుతుందని పేర్కొన్నది. ఈ తీర్పు ఆర్టికల్‌ 243 (జెడ్‌జీ), జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ - 1955 సెక్షన్‌ 71, ‘ఎన్‌పీ పొన్నుస్వామి’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని చెప్పింది. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేస్తేనే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందని ఎస్‌ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నది. శనివారం హౌజ్‌మోషన్‌ రూపంలో చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఈ అప్పీల్‌ పిటిషన్‌ విచారణకు రానున్నది. అంతకుముందు.. ఇతర మార్కులతో పోలైన ఓట్లను కూడా లెక్కించాలని ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌పై పలువురు శుక్రవారం హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఏ అభిషేక్‌రెడ్డి ధర్మాసనం.. స్వస్తిక్‌ మార్కు లేకుండా పోలైన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని పేర్కొన్నది. గెలిచిన అభ్యర్థి మెజార్టీ.. స్వస్తిక్‌ మార్కులేని ఓట్ల కంటే ఎక్కువగా ఉంటే ఫలితాలు వెల్లడించవచ్చని, తక్కువుంటే వెల్లడించొద్దని స్పష్టంచేసింది.

VIDEOS

logo