బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 18:39:42

ఉగాది నాటికి గ్రేట‌ర్ వరంగ‌ల్‌వాసుల ఇంటింటికి మంచినీరు

ఉగాది నాటికి గ్రేట‌ర్ వరంగ‌ల్‌వాసుల ఇంటింటికి మంచినీరు

వ‌రంగ‌ల్ అర్బ‌న్ : ఉగాది ప‌ర్వ‌దినం నాటికి గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ప్ర‌తీ ఇంటికి స్వ‌చ్ఛ‌మైన త్రాగునీరును ప్ర‌తిరోజు అందించ‌నున్న‌ట్లు రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రి బుధ‌వారం సాయంత్రం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. హన్మకొండలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మార్చిలో ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించి ఉగాది నాటికి ఇంటింటికి న‌ల్లాల ద్వారా ప్ర‌తీరోజు నీరు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. 

వరంగల్ మహానగరంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. త్వరలో 14 వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ప్రారంభోత్సవం చేసుకుని లబ్ధిదారులకు అప్పగించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా మార్చి నాటికి నాలుగు వందల ఇండ్ల ప్రవేశం.. జూన్ నాటికి మరో వెయ్యి ఇండ్ల ప్రవేశం జ‌ర‌గ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉగాది నాటికి కాళోజి ఆడిటోరియం పూర్తి కావాల‌న్నారు. వరంగల్ నగరంలో మొత్తం 33 జంక్షన్ల అభివృద్ధికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ విభాగాలలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోనున్న‌ట్లు చెప్పారు. 

ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాష్ రావు, ఎమ్మెల్యేలు, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేషన్ ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo