బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 01:30:48

గొంతు తడిసె.. ఊరు మురిసె

గొంతు తడిసె.. ఊరు మురిసె

  • మారుమూల తండాలు, గూడేల్లోనూ మిషన్‌ భగీరథ
  • 10 కుటుంబాలు ఉన్న ప్రాంతాలకూ నీటి సరఫరా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/మంచిర్యాల: తాగునీరు కావాలంటే ఊరు మొత్తానికి ఒక్కటే బోరు దిక్కు.. అదీ లేకుంటే బిందెలెత్తుకొని మైళ్ల దూరం నడవాలె.. లేదా చెలిమ నీటితో గొంతు తడుపుకోవాలే.. ఇదీ ఒకప్పుడు ఆ పల్లెల దుస్థితి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్‌ భగీరథ పథకంతో పరిస్థితి పూర్తిగా మారింది. మారుమూల గ్రామాలు, తండాలు, గూడేల్లోనూ ట్యాంకులు నిర్మించి సోలార్‌ విద్యుత్‌తో నీటి సరఫరా చేస్తుండటంతో నీటి కోసం అల్లాడిన ఆ పల్లెల్లో జలసిరులు కురుస్తున్నాయి. నాడు బిందెలతో కిలోమీటర్లు నడిచిన ప్రజలు.. నేడు  తమ ఇంటికే  తరలొచ్చిన గంగను చూసి మురిసిపోతున్నారు.

పది ఇండ్ల కోసం ఓ ట్యాంకు..

ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులోని భద్రనాయక్‌ తండాలో పదే ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ 30 మంది లంబాడాలు నివసిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి తామంతా వాగుల్లో చెలిమ నీటినే తాగుతున్నామని, మిషన్‌ భగీరథతో తమ నీటి కష్టాలు తీరాయని సంబురపడిపోతున్నారు. గ్రామంలో 10 కేఎల్‌ ఓహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మించి, ఇంటింటికీ నల్లాలు బిగించి రెండేండ్ల నుంచి నిరంతరంగా నీటిని సరఫరా చేస్తున్నారు. 

టైగర్‌ జోన్‌లోనూ భగీరథ

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లోతొర్రె గ్రామం టైగర్‌ జోన్‌ పరిధిలో ఉన్నది. 188 ఆవాసాలున్న ఈ గ్రామంలో ఉన్న రెండు బోర్లే తాగునీటికి ఆధారం. ఇక్కడ ట్యాంకు నిర్మించి సోలార్‌ విద్యుత్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు. నల్లా నీరు రాదనుకున్న తమ ఊరిలో భరీరథ పుణ్యామా అని పుష్కలంగా తాగు నీరు లభిస్తున్నదని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

పిల్లలకు పెండ్లిళ్లు అవుతున్నాయ్‌..

వికారాబాద్‌ జిల్లా ధర్మాపూర్‌లో నీటి సమస్య కారణంగా ఆ ఊరికి ఆడపిల్లలను కోడలుగా పంపించడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయేది. ఊహ తెలిసినప్పటి నుంచి చెలిమ నీళ్లే తాగుతున్నామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కర్నాటక సరిహద్దులో ఉన్న  కొడంగల్‌ నియోజకవర్గంలో ఉన్న ధర్మాపూర్‌ కు ఇప్పుడు మిషన్‌ భగీరథ నీరు ని రాటంకంగా సరఫరా అవుతున్న ది. ఇంటికే నీరొస్తుండటంతో ఊళ్లోని యువతకు పెండ్లిళ్లు అవుతున్నాయని గ్రామస్థు లు సంబురపడుతున్నారు. 

దశాబ్దాల సమస్యలకు చెక్‌..

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఊట్ల ఓ ఆదివాసీ గ్రామం. టైగర్‌ జోన్‌ పరిధిలో ఉన్న ఈ గ్రామంలో నాయక్‌పోడ్‌ తెగకు చెందిన 75 మంది నివసిస్తున్నారు. అడవి మధ్యలో ఉన్న ఈ గ్రామంలో దశాబ్దాల నుంచి తాగునీటి సమస్య ఉండేది. ప్రభుత్వం ఇక్కడ మిషన్‌ భగీరథ కింద నీటి ట్యాంకు నిర్మించారు. ఇప్పుడా గ్రామానికి రోజూ నీరు సరఫరా అవుతున్నది.

మునుపు ఒర్రె నీళ్లు తాగేటోళ్లం

మునుపు ఒర్రెలోని నీళ్లే తాగేటోళ్లం. వానకాలంలో మస్తు తిప్పలయ్యేది. బురద నీళ్లే తా గాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చి కేసీఆర్‌ సార్‌ సీఎం అయినంక మా బతుకులు మారిపోయినయ్‌. ఇప్పుడు 24 గంటలు తాగు నీళ్లిస్తున్నరు. కేసీఆర్‌ సార్‌ వల్లే మా బతుకులు బాగుపడ్డయ్‌. 

- గెడం భరత్‌, లోతొర్రె గ్రామం


logo