మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 01:19:06

గోదారి పరుగులు

గోదారి పరుగులు

-కాళేశ్వరం లింక్‌ -1,2లో నిర్విరామంగా ఎత్తిపోతలు 

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మొన్నటివరకు ఎత్తిపోతలు నిలిపేసిన అధికారులు.. మంగళవారం మళ్లీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లింక్‌-1,2లో మోటర్లు దిగ్విజయంగా నడుపుతూ, ఎగువకు జలాలను ఎత్తిపోస్తున్నారు. గురువారం భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్‌హౌజ్‌లో 4వ నంబర్‌ మోటర్‌ నడిపిస్తూ సరస్వతి బరాజ్‌లోకి 2,100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌజ్‌లో ఒక మోటర్‌ నడుపుతుండగా, 2,900 క్యూసెక్కుల నీరు మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్‌లోకి చేరుతున్నది. ఇక్కడి నీటిని అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతి పంప్‌హౌజ్‌ ద్వారా ఎగువన ఎల్లంపల్లి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ ఒకటో నంబర్‌ మోటర్‌ను నడిపిస్తుండగా, 2,610 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి బరాజ్‌లోకి చేరుతున్నది. లింక్‌-2లో భాగంగా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్‌హౌజ్‌లో 2,3వ మోటర్లు నడుస్తున్నాయి. ఒక్కో మోటర్‌ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కులు నంది రిజర్వాయర్‌లోకి తరలుతున్నది. ఇక్కడి నుంచి 7వ ప్యాకేజీలోని జంట సొరంగాల ద్వారా 8 ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌజ్‌కు తరలుతున్నాయి. ఇక్కడ 2, 4వ పంపులు 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నాయి. రెండు రోజుల్లో గాయత్రి పంప్‌హౌజ్‌ ద్వారా 1.048 టీఎంసీల జలాలను ఎత్తిపోసినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 

ఎల్‌ఎండీకి 6వేల క్యూసెక్కులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి రెండోరోజైన గురువారం 6 వేల క్యూసెక్కుల నీటిని తరలించారు. ఎస్సారార్‌ 14, 15, 16వ నంబర్‌ గేట్లతోపాటు ఒక రివర్స్‌ స్లూయీస్‌ గేటు ద్వారా ఎల్‌ఎండీకి నీటిని వదులుతున్నట్టు ఎస్‌ఈ శ్రీకాంతారావు చెప్పారు. ఎస్సారార్‌ జలాశయంలో 25.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాగా, లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌజ్‌ నుంచి వస్తున్న నీటిని యథావిధిగా దిగువకు పంపుతున్నట్టు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. కాగా ఎస్సారార్‌ జలాశయం నుంచి ఎల్‌ఎండీకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి 5,300 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వస్తుండగా, అంతే మొత్తంలో అవుట్‌ఫ్లో రూపంలో బయటికి వెళుతున్నట్టు అధికారులు తెలిపారు. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 7.979 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు వారు పేర్కొన్నారు. 


logo
>>>>>>