గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 05:00:00

ప్రహసనం వీడి ప్రవాహం

ప్రహసనం వీడి ప్రవాహం
  • అందుబాటులోకి దశాబ్దాలనాటి పెండింగ్‌ ప్రాజెక్టులు
  • చిత్తశుద్ధితో పూర్తిచేసిన తెలంగాణ ప్రభుత్వం
  • 2019-20లో రూ.6,670 కోట్ల వరకు వ్యయం
  • పాత పాలమూరులోనే సాగులోకి ఎనిమిది లక్షల ఎకరాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏటేటా అంచనావ్యయం పెరుగుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలపాటు ఆన్‌గోయింగ్‌ జాబితాలో చేరిన పెండింగ్‌ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభు త్వం చిత్తశుద్ధితో పూర్తిచేసింది. రీడిజైనింగ్‌ ప్రాజెక్టుల పనులను వేగంగా కొనసాగిస్తూనే.. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపైనా ప్రత్యేక దృష్టిసారించింది. వీటి పూర్తికి 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే ఏడువేల కోట్ల వరకు వెచ్చించింది. ఒక్కపాత పాలమూరు జిల్లాలోనే నాలుగు కీలకప్రాజెక్టుల ద్వారా ఎనిమిది లక్షలకుపైగా ఎకరాలు సాగులోకి రావడంతో ఆ జిల్లా ముఖచిత్రమే మారింది. రాష్ట్రంలో 38 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టగా.. అందులో 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మిగిలినవాటిలో కొన్నిపాక్షికంగా పూర్తికాగా, వీలునుబట్టి సాగునీటిని  అందిస్తున్నాయి.


తెలంగాణ ఏర్పడేనాటికి అలీసాగర్‌, గుత్ప ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యా యి. కానీ, తెలంగాణ ప్రభుత్వం సాగునీటిరంగానికి పెద్దపీటవేస్తూ ప్రాజెక్టుల పనులను వేగంగా కొనసాగించడంతో రాష్ట్రంలో 80లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందుతున్నది. అన్నిప్రాజెక్టులు పూర్తయితే 53.02 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, మరో 25.93 లక్షల ఎకరాలకు స్థిరీకరణ సాధ్యమవుతుంది. 2019-20లో సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.8,076.83 కోట్లు వెచ్చించగా.. అందులో 83 శాతం అంటే 6,670.05 కోట్లు ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపైనే ఖర్చుచేసింది. దీంతో అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. పాత పాలమూరు జిల్లాలోని కోయిల్‌సాగర్‌ ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.65లక్షల ఎకరాలు నీటి సరఫరా జరుగడంతోపాటు, దీనిద్వారా వేల చెరువుల్లో ఏడాది పొడవునా జలకళ ఉట్టిపడుతున్నది. భీమా ద్వారా 2.03 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద మరో రెండు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. 


ఆయువుపట్టుగా రెండు జలాశయాలు

ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్ల తరబడి కొనసాగిన ఎల్లంపల్లి, శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టులను సైతం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడంతో ప్రస్తుతం అవి తెలంగాణకు ఆయువుపట్టుగా మారాయి. ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రానున్న సీజన్‌ నుంచి 530 టీఎంసీలను వినియోగించడంలో ఈ రెండింటి పాత్ర అత్యంత కీలకంగా మారనున్నది. అదనంగా 46 టీఎంసీల వరకు నీటినిల్వకు అవకాశం ఏర్పడింది. 


logo
>>>>>>