శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 20:07:34

తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్‌కు నీటి విడుదల

తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్‌కు నీటి విడుదల

అయిజః కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్‌ ఆనకట్టకు సాగునీరు విడుదల చేశారు. గురువారం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 1.08 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్డీఎస్‌ చివరి ఇండెంట్‌లోని 1.08 టీఎంసీల నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని టీబీ డ్యాం ద్వారా తుంగభద్ర నదిలోకి విడుదల చేసినట్లు  డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. 

మొదట మూడు రోజులు.. ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు 3,500 క్యూసెక్కులు, 23వ తేదీన 2,000 క్యూసెక్కుల చొప్పున 1.08 టీఎంసీల నీటిని ఆర్డీఎస్‌ ఆనకట్టకు విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, శుక్రవారం టీబీ డ్యాం నుంచి విడుదలైన నీరు ఈ నెల 23వ తేదీ నాటికి ఆర్డీఎస్‌ ఆనకట్టకు చేరకునే అవకాశం ఉందని పీజేపీ ఎస్‌ఈ రఘునాథరావు తెలిపారు. ఆర్డీఎస్‌ ఆయకట్టులోని 20 వేల ఎకరాలకు సాగునీరు, అయిజ, వడ్డెపల్లి, రాజోళి, మానవపాడు, ఉండవెళ్లి, అలంపూర్‌ మండలాలకు తాగునీటి అవసరాల కోసం నీటిని వినియోగించనున్నట్లు ఎస్‌ఈ పేర్కొన్నారు. ఆర్డీఎస్‌ ఆనకట్టకు నీరు చేరగానే ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామన్నారు.



logo