మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 02:08:48

భీమా ద్వారా 48వేల ఎకరాలకు సాగునీరు

భీమా ద్వారా 48వేల ఎకరాలకు సాగునీరు

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • భీమా ఫేజ్‌-2 మోటర్ల ప్రారంభం

కొత్తకోట/మదనాపురం: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి రామన్‌పాడు బ్యాక్‌ వాటర్‌ను భీమా ఫేజ్‌-2 ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషాతో కలిసి వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిరుమలాయపల్లి శివారులోని రాజీవ్‌ భీమా ఫేజ్‌-2 లిఫ్ట్‌ స్విచ్‌ ఆన్‌ చేసి మోటర్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భీమా ఎత్తిపోతల రెండో దశ ద్వారా 48 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. పునరావాస పనులు పెండింగ్‌లో ఉన్నా సాగు నీటికి ఇబ్బందులు లేకుండా ఐదేండ్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌కు మోటర్ల ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. జురాల దిగువకు కృష్ణా జలాలు చేరిన వెంటనే కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీరందిస్తామని తెలిపారు. రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు.


logo