శనివారం 06 జూన్ 2020
Telangana - May 02, 2020 , 13:30:58

రంగనాయక సాగర్‌ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల

రంగనాయక సాగర్‌ కుడి, ఎడమ కాల్వలకు  నీటి విడుదల

సిద్దిపేట : జిల్లాలోని చిన్నకోడూర్‌ మండలంలోని రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాలువల ద్వారా మంత్రి హరీశ్‌ రావు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజా, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, భూపతి రెడ్డి, అధికారులు, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఈఎన్‌సీ హరిరామ్‌ మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు సొరంగం నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ ఈ రోజు మరపురాని రోజన్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఈ రోజు కోసం రైతులు తరతరాలుగా ఎదురు చూశారన్నారు. కాలువల వెంట గోదారమ్మ బిరబిరా పరుగెడుతుంటే రైతుల కళ్లలో ఆనంద బాష్పాలు కారుతున్నాయన్నారు. 

రైతులు ఇంతకాలం కరెంటు, కాలం మీద ఆధారపడి సాగు చేశారు. ఇకనుండి వీటితో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించే రోజులు వచ్చాయన్నారు. ఏడాదంతా రంగనాయక సాగర్‌కి నీళ్లు వస్తాయి కాబట్టి కరువును శాశ్వతంగా పారదోలొచ్చన్నారు. కుడి కాలువ ద్వారా 40 వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగు అవుతుందన్నారు. ప్రాజెక్టు కింద ఉన్న చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలన్నింటిని నింపుతామన్నారు. కాగా మైనరీ, సబ్‌ మైనరీ కాల్వల తవ్వకాలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి కోరారు.

logo