శనివారం 29 ఫిబ్రవరి 2020
ఏప్రిల్‌లో మూడుబరాజ్‌లు ఖాళీ

ఏప్రిల్‌లో మూడుబరాజ్‌లు ఖాళీ

Feb 15, 2020 , 02:24:36
PRINT
ఏప్రిల్‌లో మూడుబరాజ్‌లు ఖాళీ
  • సాంకేతిక పరిశీలన కోసం అధికారుల నిర్ణయం
  • లక్ష్మీబరాజ్‌ నుంచి మొదలుకానున్న ఎత్తిపోతల ప్రక్రియ
  • ఎల్లంపల్లి.. అవసరమైతే పునర్జీవ పథకంతో ఎస్సారెస్పీకి జలాల తరలింపు
  • సమ్మక్క బరాజ్‌లో ఆరు టీఎంసీలదాకా నిల్వకు కసరత్తు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కిలోమీటర్ల మేర.. నిండుకుండల్లా జలకళ ఉట్టిపడుతున్న గోదావరి బరాజ్‌లు మరికొన్ని రోజుల్లో ఖాళీ కానున్నాయి. సాంకేతిక ప్రొటోకాల్‌లో భాగంగా బరాజ్‌ల్లోని నీరంతటినీ ఖాళీచేయాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది తొలిసారిగా ఈ బరాజ్‌ల్లో నీటిని నిల్వచేసిన దరిమిలా నిర్మాణాలను పరిశీలించేందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నారు. శుక్రవారం రాత్రిగానీ శనివారం ఉదయంగానీ లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌ నుంచి ఎత్తిపోతల ప్రక్రియ మొదలుకానున్నది. వచ్చే జూన్‌ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏటా 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సంసిద్ధులై ఉండాలని, లక్ష్మీబరాజ్‌, సరస్వతి బరాజ్‌ (అన్నారం), పార్వతి బరాజ్‌ (సుందిల్ల), ఎల్లంపల్లి రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటిని ఏప్రిల్‌ 10లోగా ఖాళీచేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. దీంతో మూడుబరాజ్‌ల్లోని నిల్వలను ఖాళీచేసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చేవర్షాకాలంలో వరదలు వచ్చేనాటికి సాంకేతిక ప్రొటోకాల్‌ను పూర్తిచేయాలని నిర్ణయించారు.


 సాధారణంగా రిజర్వాయర్లు, బరాజ్‌లలో తొలిసారి నీటిని నిల్వచేశాక నిర్మాణాల్లో ఏమైనా మార్పు లు చోటుచేసుకున్నాయా? ఒకవేళ చోటుచేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు, మరమ్మతులు చేపట్టాలి? అని పరిశీలించేందుకు దానిని ఖాళీచేస్తారు. శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయాన్ని 15 టీఎంసీల మేర నింపిన తర్వాత మొత్తం ఖాళీచేసి సాంకేతిక ప్రొటోకాల్‌ను పూర్తిచేశారు. అదేరీతిన గోదావరిపై నిర్మించిన మూడుబరాజ్‌ల్లోనూ సాంకేతిక పరిశీలన కోసం అధికారులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం రాత్రిగానీ శనివారం ఉదయంగానీ లక్ష్మీబరాజ్‌ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. అలా సరస్వతి, పార్వ తి పంపుహౌజ్‌ల్లోనూ మోటర్లను ప్రారంభిం చి, వాటిల్లోని జలాలను ఎల్లంపల్లికి తరలించనున్నారు. మూడుబరాజ్‌ల్లో ప్రస్తుతం దాదాపు 25 టీఎంసీలకు పైగా నీటినిల్వ ఉన్నది. ఇందులో దాదాపు 20 టీఎంసీల వరకు నీటిని ఎల్లంపల్లికి తరలించే అవకాశమున్నది. 


అవసరమైతే ఎస్సారెస్పీకిజలాల తరలింపు

ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా.. శుక్రవా రం అందులో 11 టీఎంసీల వరకు నీటినిల్వ ఉన్నది. అక్కడినుంచి లోయర్‌మానేరుకు జలాల తరలింపు ఇప్పటికే మొదలైంది. ఎల్‌ఎండీకి ఐదు టీఎంసీలు తరలించేందుకు నిర్ణయించినందున ఎల్లంపల్లి నిల్వ ఐదారు టీఎంసీలకు తగ్గుతుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి బరాజ్‌ల్లోని నిల్వలను ఇక్కడికి తరలిస్తారు. అవి 20 టీఎంసీల వరకు ఉన్నందున దాదాపు 15 టీఎంసీలను ఎల్లంపల్లిలో ఉంచుతారు. మిగిలిన నీటిని ఎస్సారెస్పీ పునర్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్‌ జలాశయానికి తరలించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇక.. మూడు బరాజ్‌ల్లోని దాదాపు 25 టీఎంసీల్లో 20 టీఎంసీల ఎల్లంపల్లి, ఎస్సారెస్పీకి తరలించిన తర్వాత మిగిలిన నీటిని గేట్లుఎత్తి దిగువకు వదలనున్నారు. ఆ తర్వాత మూడుబరాజ్‌ల వద్ద సాంకేతిక పరిశీలన పూర్తిచేస్తారు. ఇది పూర్తయితే ఇక రాను న్న సీజన్‌ నుంచి బరాజ్‌లను పూర్తిస్థాయిలో నింపుతారు. కాగా, మూడుబరాజ్‌ల గేట్లు ఎత్తి దిగువకు వదిలిన నీళ్లు సమ్మక్క (తుపాకులగూడెం) బరాజ్‌కు చేరుతాయి. ప్రస్తుతం సమ్మక్క బరాజ్‌ గేట్ల బిగింపు ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్‌ చివరినాటికి వీటి బిగింపును పూర్తిచేసి.. ఎగువన బరాజ్‌ల నుంచి వచ్చేనీటిని నిల్వ చేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.


logo