గురువారం 26 నవంబర్ 2020
Telangana - Sep 18, 2020 , 01:54:23

రెండేండ్ల తర్వాత సింగూర్‌కు జలకళ

రెండేండ్ల తర్వాత సింగూర్‌కు జలకళ

పుల్కల్‌: రెండేండ్ల తర్వాత సింగూర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకొన్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారినా.. సింగూర్‌ ప్రాజెక్టుకు వరద రాక నిన్నామొన్నటి వరకు వెలవెలపోయింది. కాగా, ఇటీవల పరివాహాక ప్రాంతంలో భారీవర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి పెద్దమొత్తంలో వరద చేరుతున్నది. మూడు రోజుల నుంచి డ్యాంలోకి 70 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీలకు చేరుకున్నది. వేసవిలో నీళ్లు లేక బోసిపోయిన ప్రాజెక్టు వాన నీటితో మూడు రోజుల్లోనే 11 టీఎంసీలకు చేరుకున్నది. ఈ సీజన్‌లో జూలైలో చివరి వారంలో ఇన్‌ఫ్లో ప్రారంభమై ఆగస్టు వరకు మూడు టీఎంసీల నీరు చేరింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాం లోకి మూడు రోజుల్లోనే ఏకంగా 9 టీంఎంసీల నీరు చేరిం ది. ఎగువ ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్రలోని బీదర్‌, బాల్కీ, నాందేడ్‌ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో శుక్రవారం వరకు మరింత ఇన్‌ఫ్లో చేరుతుందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు. రెండేండ్ల తర్వాత ప్రాజెక్టులోకి భారీగావరద రావడంతో నీటి పారుదలశాఖ అధికారులు, రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గురువారం అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అధికారులు, రైతులతో కలిసి డ్యాంను సందర్శించి గంగమ్మకు పూజలు చేశారు.