సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 00:51:17

ఆల్మట్టికి పెరిగిన వరద

ఆల్మట్టికి పెరిగిన వరద

  • శ్రీశైలానికి 14,464 క్యూసెక్కులు
  • ఎస్సారెస్పీకి వస్తున్న 1,200 క్యూసెక్కులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణా బేసిన్‌లో వరద పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి శుక్రవారం ఇన్‌ఫ్లో పెరిగింది. 72,031 క్యూసెక్కుల వరద వస్తుండటంతోపాటు రానున్న రెండు రోజుల్లో వరద మరింత పెరగనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కర్ణాటక అధికారులు ఆల్మట్టి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా దిగువకు 15 వేల క్కూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో నారాయణపూర్‌ జలాశయానికి ఇన్‌ఫ్లో మోతాదు పెరిగింది. శుక్రవారం 16 వేల క్యూసెక్కుల వరద నారాయణపూర్‌కు వస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఆల్మట్టి జలాశయంలో 129.72 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికిగాను 87.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.  నారాయణపూర్‌ జలాశయం నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలకు గాను ప్రస్తుతం 27.37 టీఎంసీల నిల్వ ఉన్నది.  కాగా భీమాపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్ట్‌కు కూడా దాదాపు ఐదు వేల క్యూసెక్కుల వరకు వరద వస్తున్నది. దిగువన జూరాలకు మాత్రం వరద స్వల్పంగానే వస్తున్నది. శుక్రవారం 1,709 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జూరాల సామర్థ్యం 9.657 టీఎంసీలుకాగా 7.817 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.  శ్రీశైలం జలాశయానికి 14,464 క్యూసెక్కుల వరద నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 814.10 అడుగులకు చేరింది.  

గోదావరి బేసిన్‌లో స్థిరంగా..

గోదావరిలో వరద ప్రవాహం గత నాలుగైదు రోజులుగా స్థిరంగా ఉన్నది. కాళేశ్వరం మీదుగా 80 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం ఉండగా.. పేరూర్‌ వద్ద 1.05 లక్షల క్యూ సెక్కులకుపైగా వరద దిగువకు పోతున్నది. కడెంకు 936 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉన్నది. శ్రీరాంసాగర్‌కు 1,2 00 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 691 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్ట్‌లో శుక్రవారం సాయంత్రానికి 1071.50 అడుగుల వద్ద 32.061 టీఎంసీలు నిల్వ ఉన్నది.

వరదలో కొట్టుకుపోయిన కారు

బోనకల్లు: వాగుచప్టా మీది నుంచి వెళ్తున్న కారు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయింది. జాలరుల అప్రమ త్తతో నలుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. శుక్రవారం  ఖమ్మం జిల్లా బోనకల్‌ మండ లం చిన్న బీరవల్లి పెద్దవాగు చప్టా నుంచి వెళ్తున్న ఓ కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అక్కడే చేపలు పడుతున్న ఏన్కూరు మండలం జెన్నారానికి చెందిన అశోక్‌, తమ్మారపు బ్రహ్మయ్య వెంటనే కారు అద్దాలు పగులగొట్టి డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.  logo