శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:36:57

వేంపేటలో నీటికుక్కలు!

వేంపేటలో నీటికుక్కలు!
  • మెట్‌పల్లి మండలంలో ఆవాసం
  • నదుల నుంచి చెరువుల్లోకి వలస
  • జలవనరులు పెరుగడంతో ఉనికి
  • అరుదైన జాతికి మంచిరోజులు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నదుల్లో మనుగడ సాగించే అత్యంత అరుదైన మృదువైన నీటికుక్కలు(స్మూత్‌ ఇండియన్‌ ఆటర్స్‌) రాష్ట్రంలోని చెరువుల్లోనూ జీవం పోసుకుంటున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో అక్కడక్కడ కనిపించే నీటికుక్కలు, ప్రస్తుతం రెండు జీవనదులను ఆనుకొని ఉన్న చెరువులు, సరస్సులో దర్శనమిస్తున్నాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట పెద్దచెరువు, పెద్ద వాగులో పదులసంఖ్యలో కనిపించాయి. గోదావరి దిగువన 90 ఎకరాల్లో ఉన్న వేంపేట పెద్దచెరువు ప్రస్తుతం వీటికి సురక్షిత స్థావరంగా మారింది. ఇవి నీటిలో స్వేచ్ఛగా విన్యాసాలు చేస్తుండటంతో వింత జంతువులుగా భావించిన స్థానికులు అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. పెద్దపల్లి డీఎఫ్వో రవిప్రసాద్‌ రేంజ్‌ అధికారులను పంపించి విచారించగా నీటికుక్కలుగా గుర్తించారు. గోదావరిలో వాటి సంతతి పెరుగడంతో అక్కడి నుంచి పొలాల మీదుగా పెద్దవాగులోకి వెళ్లాయని భావిస్తున్నారు.  


అంతిరిస్తున్న జాబితాలో నీటి కుక్కలు

మృదువైన చర్మంతో, పదునైన పండ్లతో కనిపించే ఇవి ఎక్కువగా నీటిలోనే ఉంటాయి. గుంపులుగా సంచరిస్తాయి. చేపలే ప్రధాన ఆహారం. అవసరాన్ని బట్టి భూమిపై ఎలుకలు, బాతులు, కొంగలను కూడా వేటాడుతాయి. రెండున్నర మీటర్ల వరకు పొడవుండే నీటికుక్కల శాస్త్రీయ నామం లుధేరా. వీటి తోక దాదాపు మీటర్‌ ఉంటుంది. కృష్ణానది ప్రవహించే బీచుపల్లి, సోమశిలలోని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో, గోదావరి నదితోపాటు శివ్వారం అభయారణ్యం, మంజీరానదిలో అరుదుగా కనిపిస్తున్నాయి. మిషన్‌కాకతీయ లో భాగంగా చెరువులను తవ్వి కృష్ణా, గోదావరి నీటితో నింపుతున్న విషయం తెలిసిందే. నదుల్లో మనుగడ సాగిస్తున్న నీటికుక్కలు సమీపంలోని చెరువులకు వలస వచ్చి స్థావరాలను ఏర్పర్చుకుంటున్నాయి. అత్యంత ప్రమాదపు అంచున అంతరిస్తున్న జాబితా లో ఉన్న ఈ జాతి తెలంగాణలో సంతతి పెంచుకుంటున్నది. ఇవి నీటి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. శుద్ధ జలాలున్నచోటే ఇవి మనుగడ సాగిస్తాయి. వేంపేట తదితర ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా శుద్ధమైన నీరుండటంతో సంతతిని పెంచుకుంటున్నాయి.

సముద్రజీవులుగా పొరబడ్డాం 

పెద్దవాగులో వీటినిచూసి ఆశ్చర్యపో యాం. సముద్రాల్లో ఉండే సీ లయన్‌, డాల్ఫిన్లుగా పొరబడ్డాం. తర్వాత నీటికుక్కలని తెలుసుకున్నాం. వేటగాళ్ల నుంచి హాని జరుగకుండా కాపాడుతాం. 

- ప్రవీణ్‌కుమార్‌, వేంపేట ఉప సర్పంచ్‌ 

ప్రత్యేక నిఘాఉంచాం 

వేంపేట పెద్ద చెరువు, దానిని ఆనుకుని ఉన్న పెద్దవాగులో నీటికుక్కలున్నట్టు గుర్తించాం. వాటికి మరింత అనువైన పరిస్థితులను కల్పిస్తాం.  

- రవిప్రసాద్‌, పెద్దపల్లి డీఎఫ్వోlogo