e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home Top Slides మండుటెండల్లో పొంగిన వాగు

మండుటెండల్లో పొంగిన వాగు

మండుటెండల్లో పొంగిన వాగు
  • ఉరకలేస్తున్న కూడవెల్లి వాగు
  • సిద్దిపేట జిల్లాలో చెరువులు, చెక్‌డ్యామ్‌లకు జలకళ
  • సిద్దిపేటకు గంగమ్మ దీవెన
  • కరువు నేలపై జలసవ్వడి
  • నిండు కుండల్లా చెరువులు
  • కాళేశ్వరం జలాలతో జిల్లాలో
  • 85 చెక్‌డ్యామ్‌లకు జలకళ
  • గంగమ్మతల్లికి రైతుల పూజలు

ఎప్పుడూ సూడలేదు
ఎండకాలంలో గిట్ల మత్తళ్లు దుంకుడు ఎప్పుడూ సూడలేదు. సీఎం కేసీఆర్‌ సార్‌ గోదారి నీళ్లను తీసుకస్త అన్నడు.. ఇదిగో ఇవ్వాళ తీసుకొచ్చి మా ఊరు చెక్‌డ్యాం నింపిండు. ఇంతకన్న ఇక మాకు ఏం గావాలె. పంటలు ఎండి పోకుండా నీరచ్చింది. మా ఊళ్లో అందరికీ సంబురం అయ్యింది. నా రెండెకరాల పొలానికి ఇక ఏం ఇబ్బంది లేదు.
-భిక్షపతి, రైతు
సాధారణంగా వేసవిలో చెరువులు ఎండిపోయి, భూగర్భజలాలు అడుగంటుతుంటాయి. కానీ సిద్దిపేట జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు గోదావరి జలాలతో పొంగిపొర్లుతున్నాయి. ఐదు రోజుల క్రితం వరకు పంటలపై ఆశలు కోల్పోయిన రైతులు ఇప్పుడు తమ గ్రామాల్లోని చెరువులు అలుగు పారుతుంటే సంబురపడుతున్నారు. గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు. పంటలు ఎండుతున్నయి అని ఒక్క మాట చెప్పగానే సీఎం కేసీఆర్‌ గోదావరి నీళ్లను విడిచి మా పంటలను కాపాడినారంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నది. గత ఐదు రోజులుగా అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌ తుక్కాపూర్‌ పంపుహౌస్‌ల వద్ద ఒక్కో మోటరు నడుస్తున్నది. ఒక్కో పంపు రోజుకు 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుంది. అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి రంగనాయకసాగర్‌కు, అక్కడి నుంచి ప్రధాన కాల్వ ద్వారా మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌కు గోదావరి జలాలు వస్తున్నాయి. అక్కడి నుంచి కొండపోచమ్మ కెనాల్‌ ద్వారా కూడవెల్లి (కుడ్లేరు) వాగుకు నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో కూడవెల్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతూ ఈ వేసవిలో కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో 22 చెక్‌డ్యామ్‌లు, సిద్దిపేట ప్రాంతంలో 63 చెక్‌డ్యామ్‌లు గోదావరి జలాలతో నిండిపోయాయి. జిల్లాలో 102 చెరువులు గోదావరి జలాలతో నిండాయి. మరికొన్ని చెరువులకు గోదావరి జలాలు చేరుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లు నిర్మించారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కొనసాగుతున్నది.
కూడవెల్లి వాగులోకి గోదారమ్మ పరుగులు
గజ్వేల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు తమ పంటలు ఎండుతున్నాయని, నీరు విడుదల చేసి కాపాడాలని రైతులు విజ్ఞప్తిచేశారు. వెంటనే అక్కడి నుంచే సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు ఫోన్‌ చేసి రైతుల సమస్యను వివరించారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్‌ తక్షణమే నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు కొండపోచమ్మ కెనాల్‌ నుంచి ఐదు రోజుల కిందట నీటిని విడుదల చేశారు. గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల మీదుగా వెళ్లే కూడవెల్లి వాగు పై మొత్తం 39 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ఐదు రోజులు గా గోదావరి జలాలను విడుదల చేయడంతో గజ్వేల్‌, తొగుట, మిరుదొడ్డి మండలాల్లోని 22 చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద ప్రారంభమై, అక్కడి నుంచి మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌ వరకు గోదావరి నీళ్లు చేరుకున్నాయి. సుమారు ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతున్నది. సిద్దిపేట నియోజకవర్గంలో 81 చెరువులు, 63 చెక్‌డ్యామ్‌లు నిండాయి. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, తొగుట మండలాల్లో 21 చెరువులు అలుగులు పారుతున్నాయి. దీంతో ఈ ప్రాంత రైతులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జల సంబురాలు చేసుకుంటున్నారు. మరో నాలుగైదు రోజుల్లో కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి గజ్వేల్‌ కెనాల్‌ ద్వారా మిగిలిన కూడవెల్లి చెక్‌డ్యామ్‌లు నింపడంతోపాటు హల్ద్దీ వాగులోకి నీటిని విడుదల చేయనున్నారు. పొట్ట దశలో ఉన్న వరి పంటలకు ఈ నీళ్లు ఎంతో అవసరం అవుతున్నాయని రైతులు చెబుతున్నారు.


నీళ్లను సూత్తె సంతోషమైతంది
గోదావరి నీళ్లు ఇట్ల వస్తయని అనుకోలేదు.. ఇవ్వాళ నీళ్లను సూత్తె సంతోషమైతున్నది. సీఎం కేసీఆర్‌ సార్‌ మాకు ఎండకాలంలో నీళ్లు ఇచ్చి మా పంటలను కాపాడిండు. ఆరు ఎకరాల పొలం పెట్టిన.. గోదారి నీళ్లు వచ్చినయి.. ఇగ మా పంటలకు ఏం ఢోకా లేదు. మా పంటలు మంచిగ పండుతాయి. ఇవ్వాళ మా చెక్‌డ్యాం నిండగానే మేమంతా పూజలు చేసినం.

  • వెంకట్రాంరెడ్డి, రైతు, అహ్మదీపూర్‌
మండుటెండల్లో పొంగిన వాగు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మండుటెండల్లో పొంగిన వాగు

ట్రెండింగ్‌

Advertisement