గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 02:24:13

అవసరమైతే.. మరింత సాయం

అవసరమైతే.. మరింత సాయం

 • ఇది తాత్కాలిక, తక్షణ సాయం మాత్రమే
 • దసరా తర్వాత నివేదికలను బట్టి పెంపు
 • పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటన
 • బాధితులకు పలుచోట్ల రూ.10వేల పంపిణీ
 • తొలిరోజు 1036 మందికి నగదు అందజేత
 • బాధితులకు అండగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు
 • సహాయ చర్యల్లో కార్యకర్తలు నిమగ్నం
 • 2 నెలల జీతం విరాళంగా ఇచ్చిన నగరంలోని టీఆర్‌ఎస్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు
 • రాజధాని వరద బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

ఆపదలో ఉన్న అభాగ్యులకు గుండె ధైర్యం లభించింది. చినుకుపడ్డ తొలిక్షణం నుంచి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రాణనష్టాన్ని నివారించడమే కాకుండా సర్వం కోల్పోయినవారికి ఊరట కలిగించాయి. ‘వరదల్లో ఇంట్లో సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి. అలాంటి సమయంలో రేషన్‌ కిట్లు ఇచ్చి ఆకలి తీర్చారు. ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి’ అని ఖైరతాబాద్‌ బీఎస్‌ మక్తాకు చెందిన ఫాతిమా దస్తగిరి దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. ‘గతంలో చాలాసార్లు వర్షాలు వచ్చినై.. కానీ ఎప్పుడూ ఎవరూపైసలియ్యలేదు. కేసీఆర్‌ సారుకు కష్టాలు తెలుసు కనుక మంచిగ చేస్తుండు’ అని బాలానగర్‌ రాజీవ్‌గాంధీ నగర్‌లోని కీరాబాయి ఆనంద భాష్పాలు రాల్చింది.. వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ స్వయం గా బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా.. అవసరమైతే సహాయాన్ని పెంచడానికి సిద్ధమన్నారు.

పసికందు ఆకలి తీర్చారు

నాకు ముగ్గురు ఆడపిల్లలు. నా భర్త కూలి పనిచేస్తేనే మా కడుపులు నిండుతాయి. లాక్‌డౌన్‌లో ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు కూడా సరైన పనులు దొరకటం లేదు. ఇప్పుడు భారీ వర్షాలు మమ్ముల్ని నిండా ముంచాయి. ఇంట్లో వంట సరుకులు తడిచిపోయాయి. ఖర్చులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. రేషన్‌ సరుకులు, డబ్బులు ఇచ్చి ఎనిమిది నెలల పసికందు ఆకలి తీర్చారు. సీఎం కేసీఆర్‌ దేవుడిలా డబ్బులు పంపించి ఆదుకున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.

- ఎన్‌ విజయశాంతి, బీఎస్‌ మక్తా, ఖైరతాబాద్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ముంపు ప్రభావిత కుటుంబాలు అధైర్యపడొద్దని, వారిని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణ సాయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన రూ.10వేల నగదును మంత్రి కేటీఆర్‌ మంగళవారం పలువురికి అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తొలిరోజు 1,036 మందికి నగదు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు వారి ఇంటి వద్దనే ఈ ఆర్థిక సహాయం అందజేస్తామని, అవసరమైతే ఈ సహాయం మరింత పెంచడానికి కూడా సిద్ధమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కనీవినీ ఎరుగనిస్థాయిలో పడిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదతో కష్టాలు పడుతున్న బాధితులను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. బురదలో, మురుగునీటిలో నడుస్తూ వారిని పలుకరించారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని, బాధితులందరికీ సాయం చేస్తామని కేటీఆర్‌ వారికి భరోసా కల్పించారు. ఖైరతాబాద్‌లోని ఎమ్మెస్‌ మక్తాతోపాటు షేక్‌పేట నదీమ్‌ కాలనీ, ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని నాగోలు అయ్యప్ప కాలనీ, లింగోజిగూడ డివిజన్‌లోని కామేశ్వరరావు కాలనీ, సాయినగర్‌, జనప్రియ కాలనీల్లో ఆయన పర్యటించారు. జనప్రియ కాలనీలో పిలిచిన ప్రతి అపార్ట్‌మెంట్‌వాసులను పలుకరిస్తూ ముందుకుసాగారు. ఇప్పుడొచ్చిన ఈ కష్టం వర్ణనాతీతమని, అయితే ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా స్థానిక కార్పొరేటర్‌, డిప్యూటీ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ‘మీ కార్పొరేటర్‌ తెలుసా? వారి ఫోన్‌ నంబర్‌ మీ దగ్గర ఉందా? వారి నంబర్‌ మీదగ్గర ఉంచుకోవాలి’ అని చెప్పారు. వరద బాధితులకు ప్రభుత్వం తరఫున రూ.10వేల నగదును అందజేశారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.10వేల సహాయం తాత్కాలిక, తక్షణ సహాయం అని చెప్పారు. దసరా పండుగ తరువాత ఎమ్మెల్యేలు, అధికారులు ఇచ్చే నివేదికల ఆధారంగా ఇండ్లు, సామగ్రి కోల్పోయిన వారికి సహాయం అందిస్తామని తెలిపారు.

నగరంలో ఎంతమంది బాధితులు ఉంటే అంతమందికీ సహాయం అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ ప్రతి వ్యక్తికి/కుటుంబానికి ఈ సాయం అందాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌లు, ఎన్జీవోలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందేటట్టు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వ సహాయాన్ని స్వయంగా అందించి భరోసా నింపేందుకు కాలనీల్లో పర్యటిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వారికి తెలిపారు. రానున్న ఒకటి, రెండు రోజుల పాటు మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.


తొలిరోజు 100 టీంలు.. నేటి నుంచి 200 టీంలు

జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ముమ్మరంగా సాగింది. తొలిరోజు 1036 మందికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించినట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. బాధితులకు నగదు పంపిణీలో మంగళవారం 100 టీంలు పాల్గొన్నాయి. ఒక్కో టీంలో ముగ్గురిని నియమించారు. టీంల సంఖ్యను  బుధవారం నుంచి రెట్టింపు చేయనున్నారు. ఈ సంఖ్యను 200లకు పెంచి ఆర్థిక సాయం అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. నగదు పంపిణీ కార్యక్రమాన్ని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఓవైపు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే మరోవైపు వరద కట్టడికి, కాలనీలను శుభ్రం చేసే ప్రక్రియను పర్యవేక్షించారు. 

బాధితులకు అండగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు


 • సహాయ చర్యల్లో కార్యకర్తలు నిమగ్నం
 • జీతాలను విరాళంగా ప్రకటించిన ప్రజాప్రతినిధులు

భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న హైదరాబాద్‌లోని వరద బాధితులను ఆదుకొనేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు రంగంలోకి దిగాయి. ఆపన్నులను ఆదుకొనేందుకు ముందుండాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ఇచ్చిన పిలుపునందుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నగదు సాయాన్ని అందించడంలో అధికారులకు సహకారమందించారు. మంగళవారం ఉదయంనుంచే  మంత్రి కేటీఆర్‌ సారధ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఎక్కడికక్కడ కార్యోన్ముఖులై బాధితులకు అండగా నిలిచారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ వరద ముంపులో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించటంలో భాగస్వాములయ్యారు. ఆయా ప్రాంతాల్లో బాధితుల వివరాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, వచ్చే పదిరోజుల వరకు వరదబాధితుల ఇబ్బందులు తొలగిపోయే దాకా ప్రజల మధ్యే ఉండి అండగా నిలవాలని మంత్రి  కేటీఆర్‌ సూచించారు. 

ప్రజా ప్రతినిధుల రెండునెలల జీతం విరాళం

వరద బాధితులకు సాయం చేసేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. తమ రెండునెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తామని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు తమ నెలవేతనాన్ని విరాళం ఇస్తామని తెలిపారు. రెండునెలల జీతాన్ని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో అభినందించారు.

సాయాన్ని ఎన్నటికీ మరువం

పేదోల్లం. కూలీనాలీ చేస్కోని గుడిసెలల్ల బతుకుతం. కుండపోత వాన ఆ గుడిసెను గుల్ల జేసింది. ఇట్లాంటి టైంల సీఎం కేసీఆర్‌ సార్‌ ఎంబడే సాయం అందించి మాలాంటి పేదోళ్లకు ఎంతో భరోసిచ్చిండు. ఏండ్ల సంది ఇట్లనే బాధల పడతనే ఉన్నా. ఈ సారి మాత్రం తెల్లవారే సరికి ఎమ్మెల్యే సారు, పెద్ద సార్లు ఇంటికొచ్చి ఎట్టున్నరు అని పలుకరిచ్చిర్రు. ఇంట్లకు నడుం లోతు నీల్లొచ్చినయ్‌. బియ్యం పప్పలు పాడైనయ్‌. ఈ టైంల పదేల రూపాయలిచ్చి మీకు మేం అండగా ఉన్నం అని సీఎం సారు  నిరూపిచ్చిర్రు.  గిట్లాంటి సాయాన్ని ఎన్నటికీ మరువం.

- దేవీ, న్యూ కాలనీ, మియాపూర్‌ 

పుస్తకాలు కొనిస్తామన్నారు

గుడిసెలోకి నీళ్లొచ్చి సామాన్లన్నీ తడిచిపోయాయి. ఎమ్మెల్యే సారొచ్చి మమ్మల్ని పక్కనున్న స్కూల్‌ బిల్డింగ్‌లోకి పంపించిండు. నా పుస్తకాలన్నీ తడిచిపోయాయి. కేటీఆర్‌ సార్‌కు చెబితే పుస్తకాలు కొనిస్తాం అని అన్నాడు. గుడిసెలోకి నీళ్లు వచ్చినందుకు నాలుగురోజుల నుంచి అమ్మ ఏడుస్తున్నది. కేటీఆర్‌ సార్‌ వచ్చి ఇల్లు ఇప్పిస్తామని చెప్పిండు. సార్‌కు థ్యాంక్స్‌.

-ఈశ్వరి, పదో తరగతి విద్యార్థిని

కొండంత బలం

ఇంట్లోకి వరదనీరు చేరడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ప్రభుత్వం వెంటనే స్పందించి పునరావాసకేంద్రానికి పంపడమే కాకుండా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకున్నది. చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వం తాత్కాలికంగా మొదటి విడతగా అందజేసిన రూ.10 వేలు కొండంత బలాన్నిచ్చాయి.

- విజయలక్ష్మి, అయ్యప్పకాలనీ