మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:39:58

వంద మంది నిపుణులతో వార్‌రూం

వంద మంది నిపుణులతో వార్‌రూం

  • ధరణి స్లాట్‌ బుకింగ్‌ ఇబ్బందులకు ఇక చెక్‌ 
  • 1800 599 4788 నంబర్‌ ఏర్పాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన క్షణాల్లోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. బీఆర్కేభవన్‌లోని 10వ అంతస్తులో ధరణి వెబ్‌సైట్‌ వార్‌రూం సిద్ధమవుతున్నది. 100 మంది సాంకేతిక నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధరణి వెబ్‌సైట్‌పై ఫిర్యాదులు, సమస్యలపై 24 గంటలపాటు పనిచేసే కాల్‌సెంటర్‌ను ఏరాటుచేస్తున్నట్టు పేర్కొన్నారు. ధరణి స్లాట్‌బుకింగ్‌ సమస్యల పరిష్కారానికి 18005994788 నంబర్‌తో ఏర్పాటుచేశారు. ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్‌చేయవచ్చని సీఎస్‌ సూచించారు. ఇప్పటివరకు 31,767 సభ్యులు అకౌంట్‌ ఏర్పాటు చేసుకున్నారని, ఇందులో 1,686 రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయని వివరించారు. 4,450 మంది స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారని తెలిపారు. 24 లక్షల మంది ధరణి వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయ్యారన్నారు. ఇందులో భాగంగా తొలిరోజు 442 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారని, రెండోరోజు 479, మూడోరోజు 765 చొప్పున రిజిస్ట్రేషన్లు పెరుగుతూ వచ్చాయని వివరించారు.

క్రమంగా తొలుగుతున్న ఇబ్బందులు

ధరణి పోర్టల్‌లో ఉత్పన్నమవుతున్న ఇబ్బందులు క్రమంగా తొలగుతున్నాయి. సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నారు. ధరణిని ప్రారంభించినరోజున రివర్స్‌ ఎండార్స్‌మెంట్‌లో ఇబ్బందులు రాగా, మధ్యాహ్నానికి తొలిగిపోయి రిజిస్ట్రేషన్లు సాఫీగా పూర్తయ్యాయి. మంగళవారం నామమాత్రంగా సమస్యలు రావడంతో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కొద్దిగా ఆలస్యమయ్యాయి. ఇతరచోట్ల 15-20 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తయింది. బుధవారం సమస్యలు మరింతగా తగ్గాయి. సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను నియమించారు.