గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:38:21

కరోనాను గెలిచిన అవ్వ

కరోనాను గెలిచిన అవ్వ

  • వైరస్‌పై పోరులో 94 ఏండ్ల వృద్ధురాలి విజయం
  • రాష్ట్రంలో కోలుకున్న వారిలో అధిక వయస్కురాలు
  • ఆరోగ్యంతో పంపిన గాంధీ దవాఖాన వైద్యులు
  • కరోనాపై 94 ఏండ్ల ‘విజయ’ం
  • గాంధీలో చికిత్స అనంతరం కోలుకున్న విజయలక్ష్మి

బన్సీలాల్‌పేట్‌ : కరోనాను జయించిన 94 ఏండ్ల విజయలక్ష్మి వీరగాథ ఇది.. పేగుబంధం తోడు లేకున్నా మహమ్మారిని తరిమికొట్టిన వృద్ధురాలి కథ ఇది.. హైదరాబాద్‌ చిక్కడపల్లికి చెందిన విజయలక్ష్మి (94) పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఇటీవల కరోనా సోకింది. జ్వరం, దగ్గుతో జూన్‌ 17న గాంధీ దవాఖానలో చేరారు. అయితే, ఏ మాత్రం కనికరం లేని ఆ కర్కోటక వైరస్‌ ఆమె చిన్న కుమారుడ్ని బలి తీసేసుకుంది.. కనిపెంచిన కొడుకు తన కళ్లముందే చనిపోవడంతో మానసికంగా కుంగిపోయింది. అటు కోడలికీ కరోనా సోకింది.. పెద్ద కొడుకేమో విదేశాల్లో ఉన్నాడు.. అసలే వయసు మీదపడి కాలం గడుపుతున్న ఆమె.. కరోనా వల్ల ఒంటరిదైంది. ఏం చేయాలో పాలుపోలేని స్థితికి చేరుకుంది. శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన ఆ వృద్ధురాలు.. గాంధీ వైద్యుల పర్యవేక్షణలో కరోనాను జయించింది. పేగుబంధం తోడుగా లేకున్నా.. డాక్టర్ల ప్రేమ, అనురాగాలు ఆమెను విజేతగా నిలిపాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌నుంచి కోలుకున్నవారిలో అత్యధిక వయస్కురాలు ఆమే కావడం ఓ రికార్డు. విజయలక్ష్మి ఆరోగ్యంపట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ప్రతిరోజు పరీక్షలు చేశారు.

‘నీకేం కాదమ్మా’ అంటూ ఆమెలో ధైర్యం నింపారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమారుడితో రోజూ వీడియోకాల్‌లో మాట్లాడిస్తూ ఆమెలో మానసిక ధైర్యం నింపారు. వైద్యుల సూచనలు పాటిస్తూ, సమయానికి మందులు, డ్రై ఫ్రూట్స్‌ తీసుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో మంగళవారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాజారావు మాట్లాడుతూ.. గాంధీ దవాఖానకు వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. కాగా, కరోనా సోకిన తనను వైద్యులు, నర్సులు చాలా బాగా చూసుకున్నారని విజయలక్ష్మి తెలిపారు. ప్రతిరోజు మూడుసార్లు వచ్చి ఆరోగ్యం గురించి అడిగేవారని, నీకేం కాదమ్మా అంటూ ధైర్యం ఇచ్చారని చెప్పుకొచ్చారు. రోగులందరికీ మంచి భోజనం పెట్టారన్నారు.


logo