శనివారం 11 జూలై 2020
Telangana - May 26, 2020 , 02:27:46

అందరినీ ఒక్కడే చంపేశాడు

అందరినీ ఒక్కడే చంపేశాడు

  • ఒకర్ని చంపి కప్పిపుచ్చేందుకు 9 హత్యలు
  • అందరినీ ఒక్కడే చంపేశాడు
  • ఒక మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై కన్ను
  • పెండ్లి చేసుకోవాలన్నందుకు రైల్లోనుంచి తోసి రఫిక హత్య
  • ఆచూకీపై ఆమె చిన్నమ్మ నిలదీయడంతో మరిన్ని హత్యలు
  • అన్నంలో నిద్రమాత్రలు కలిపి.. బావిలో పడేసిన సంజయ్‌

వరంగల్‌ క్రైం: ఒక తప్పు ఓ హత్యకు కారణమైంది. ఆ హత్య మరో తొమ్మిది హత్యలకు దారితీసింది. వరంగల్‌లో సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసును వరంగల్‌ పొలీసులు ఛేదించారు. నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ను అరెస్టు చేశారు. రఫిక అనే వివాహితతో సహజీవనం చేసిన నిందితుడు, ఆమె కూతురితో చనువుగా ఉండటమే ఈ హత్యలన్నింటికీ మూలకారణమని తేల్చారు. కూతురుపట్ల సంజయ్‌కుమార్‌ ప్రవర్తనను గమనించిన రఫిక, తనను పెండ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీంతో పక్కా ప్లాన్‌తో రఫికను ఆంధ్రప్రదేశ్‌లో హత్యచేసి నడుస్తున్న రైలులోనుంచి తోసేసి ఏమీ తెలియనట్టు వరంగల్‌కు చేరుకొన్నాడు. 

రఫిక ఏదని ఆమె చిన్నమ్మ నిషా నిలదీయడంతో ఆ హత్యను కప్పింపుచ్చుకొనేందుకు ఈ తొమ్మిది మంది ఉసురు తీసినట్టు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వీ రవీందర్‌ సోమవారం వెల్లడించారు. ఆరేండ్ల క్రితం జీవనోపాధి కోసం వరంగల్‌ చేరుకున్న బీహార్‌లోని బిగుసరయు జిల్లా నుర్లపూర్‌ గ్రామానికి చెందిన నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మిల్స్‌కాలనీ ప్రాంతంలోని శాంతినగర్‌లో ఉన్న గోనెసంచుల తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. ఇక్కడే పనిచేస్తున్న మక్సూద్‌ ఆలం కుటుంబసభ్యులతో సంజయ్‌కి పరిచయం ఏర్పడింది. మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రఫిక (37) భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటున్నది. 

క్రమంగా రఫికతో పరిచయం పెంచుకున్న సంజయ్‌ పైసలు ఇచ్చి ఆమె ఇంట్లోనే భోజనం చేసేవాడు. కొద్దిరోజుల అనంతరం పెండ్లి చేసుకొంటానని నమ్మించి వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం జాన్‌పాకలో ఇంటిని కిరాయికి తీసుకొని రఫిక, ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి నాలుగేండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇదే క్రమంలో యుక్త వయస్సుకు వచ్చిన తన కుమార్తెతో నిందితుడు చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తుండటాన్ని గమనించిన రఫిక సంజయ్‌తో పలుమార్లు గొడవపడింది. తనను పెండ్లి చేసుకోవాలని నిలదీసింది. అయినా అతడు పద్ధతి మార్చుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దాంతో సంజయ్‌ రఫికను అడ్డు తొలిగించాలనుకొన్నాడు. 


బెంగాల్‌లో పెద్దల వద్దకని నమ్మించి..

పెండ్లి విషయం బంధువులతో మాట్లాడాలని పశ్చిమ బెంగాల్‌కు వెళ్దామని నమ్మించి మార్చి ఆరోతేదీ రాత్రి వరంగల్‌ నుంచి వైజాగ్‌ వైపు వెళ్లే గరీబ్థ్‌ రైలులో రఫిక తో సంజయ్‌ బయలుదేరాడు. మార్గమధ్యంలో మజ్జిగ ప్యాకెట్లలో నిద్రమాత్రలు కలిపి రఫికకు అందించాడు. మజ్జిగ తాగిన ఆమెతో సంజయ్‌ రైలు ఫుట్‌బోర్డు వద్ద కూర్చొని ముచ్చటిస్తూ మత్తులోకి జారుకోగానే తెల్లవారుజామున ఏపీలోని నిడుదవోలు ప్రాంతంలో ఆమె చున్నీతోనే గొంతు బిగించి చంపి రైలులోనుంచి తోసేశాడు. దీనిపై తాడేపల్లిగూడెం రైల్వేపోలీసులు కేసు నమోదుచేశారు. రఫిక చనిపోయిందని నిర్ధారించుకొని రాజమండ్రి లో దిగి తిరిగి మరో రైలులో వరంగల్‌కు చేరుకొన్నాడు. 

చిన్నమ్మ నిషా నిలదీయడంతో..

రఫిక పశ్చిమ బెంగాల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లినట్టు నమ్మించాడు. కొద్దిరోజుల అనంతరం రఫిక బంధువుల ఇండ్లల్లో లేదని, ఎక్కడ ఉన్నదని సంజయ్‌ను ఆమె చిన్నమ్మ నిషా నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. భయపడిన నిందితుడు.. మక్సూద్‌ ఆలం, ఆయన భార్య, రఫిక చిన్నమ్మ అయిన నిషా ఆలంను హత్యచేయాలనుకొన్నాడు. సంజయ్‌ ఈ నెల 16 నుంచి 20 వరకు మక్సూద్‌ కుటుంబం పనిచేస్తున్న గొర్రెకుంటలోని గోనెసంచుల తయారీ గోదాంకు వస్తూపోతూ పరిసరాలను పరిశీలించాడు. చంపి బావిలో పడేయాలని నిర్ణయించుకొన్నాడు. ఈ నెల 20న మక్సూద్‌ పెద్ద కుమారుడు షాబాజ్‌ ఆలం పుట్టినరోజని తెలుసుకొని అదేరోజు హత్యకు ప్లాన్‌చేశాడు. ఇందుకోసం ఈ నెల 18న వరంగల్‌ చౌరస్తాలోని ఓ మెడికల్‌ షాపులో సుమారు 60కిపైగా నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 

పక్కా ప్రణాళికతో..

పథకం ప్రకారం సంజయ్‌ ఈ నెల 20న రాత్రి 7:30 గంటలకు గోదాంకు చేరుకొని మక్సూద్‌ ఆలం కుటుంబంతో చాలాసేపు ముచ్చటించాడు. మక్సూద్‌ కుటుంబం వండిన భోజనంతోపాటు, అక్కడే ఉన్న శ్యాం, శ్రీరాం తయారుచేసుకున్న భోజనంలో కూడా వారికి తెలియకుండా నిద్రమాత్రలు కలిపాడు. అది తిన్న మహమ్మద్‌ మక్సూద్‌ ఆలం (45), భార్య నిషా ఆలం (40), కుమారులు షాబాజ్‌ ఆలం (19), సోహైల్‌ ఆలం (18), మహమ్మద్‌ బుష్రా కాటూన్‌ (20), బబ్లూ (3), బీహార్‌కు చెం దిన శ్యాంకుమార్‌ షా (18),  శ్రీరాంకుమార్‌ షా (21), వరంగల్‌ కరీమాబాద్‌కు చెందిన మహమ్మద్‌ షకీల్‌ (38) మత్తులోకి జారుకొన్నారు. తొలుత ఇద్దరినే చంపాలనుకున్న నిందితుడు.. సాక్ష్యం లేకుండాచేయాలని మత్తులో ఉన్న అందరినీ చంపాలనుకున్నాడు. అర్ధరాత్రి 12:30 నుంచి ఉదయం 5 గంటల మధ్య 9 మందిని గోదాం పక్కనే ఉన్న పాడుపడ్డ బావిలో పడేశాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం మృతుల గదుల్లో ఉన్న కిరాణ సామగ్రితోపాటు వారి సెల్‌ఫోన్లు తీసుకొని తన ఇంటికి వెళ్లిపోయాడు. 

పట్టించిన సీసీ ఫుటేజీలు..

తొమ్మిది మందిని చంపిన హంతకుడిని పట్టుకోవడంలో సీసీ ఫుటేజీలు కీలకంగా పనిచేశాయని సీపీ రవీందర్‌ వెల్లడించారు. కేసు ఛేదించడానికి ఏర్పాటుచేసిన ఆరు ప్రత్యేక బృందాలు సంజయ్‌ నివాసం ఉండే జాన్‌పాక సమీపంలోని సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేయడంతోపాటు సెల్‌ఫోన్లు, వంట సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా కేసును ఛేదించడంలో శ్రమించిన ఈస్ట్‌ ఇంచార్జి డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ శివరామయ్య, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌, టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌ క్రైం, ఐటీకోర్‌, సీసీఎస్‌ టీం ఇన్‌స్పెక్టర్లు నందిరాంనాయక్‌, జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్‌, రమేశ్‌కుమార్‌తోపాటు వారి సిబ్బందిని సీపీ అభినందించారు.


logo