సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:31

ఓజోనిట్‌.. వైరస్‌ ఫట్‌

ఓజోనిట్‌.. వైరస్‌ ఫట్‌

  • సరుకులపై వైరస్‌ నిరోధానికి పరికరం
  • వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్ల ఆవిష్కరణ

నిట్‌క్యాంపస్‌(వరంగల్‌ అర్బన్‌): బయట మార్కెట్‌లో సరుకులు కొని ఇంటికి తేవాలంటే భయం.! కూరగాయల మార్కెట్‌లో నోటు ఇచ్చి చిల్లర తిరిగి తీసుకోవాలంటే జంకు.! పండ్లు, పాలు, నిత్యావసరాలు, డెలివరీ ప్యాకింగ్‌లు ఇలా ఏ రూపంలో కరోనా వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళన.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి నిరోధానికి వరంగల్‌ నిట్‌ సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించింది. నిట్‌లో భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ దినకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డీ హరినాథ్‌ సంయుక్తంగా ఓజోనిట్‌ పేరుతో ఫ్రిజ్‌ వంటి బహుళార్ధక స్టెరిలైజేషన్‌ పరికరాన్ని కనుగొన్నారు.

వాయువును పంపి.. వైరస్‌ను చంపి

నిత్యావసరాలను, సరుకులను ఫ్రిడ్జ్‌ వంటి ఈ పరికరంలో ఉంచి అందులోకి ఓజోన్‌ వాయువును పంపిస్తారు. 20 నుంచి 25 నిమిషాల వరకు ఓజోన్‌ వాయువులో ఉంచడం వల్ల వస్తువులకు ఉన్న అన్ని రకాలైన వైరస్‌లు 99.99 శాతం తొలిగిపోతాయి. కరోనా వ్యాప్తివాహక వస్తువులైన కూరగాయలు, పండ్లు, పాలు, ఆభరణాలు, సెల్‌ఫోన్‌లు, వాచ్‌లు, దుస్తులు, డెలివరీ ప్యాకింగ్‌లు.. ఇలా అన్నింటినీ వైరస్హ్రితంగా మార్చుకోవచ్చు. పండ్లు, ఇతర తినుబండారాలపై ఉండే ఫంగస్‌, బ్యాక్టీరియా, ఇతర రసాయనాలను కూడా లేకుండా శుభ్రంచేయడం దీని ప్రత్యేకత. ఓజోన్‌ పంపింగ్‌ విధానం వల్ల వస్తువులు శుభ్రమవుతాయి. ఈ ఫ్రిడ్జ్‌ను పూర్తిస్థాయిలో తయారుచేసి మార్కెట్‌లోకి తీసుకొస్తామని ప్రొఫెసర్‌ దినకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హరినాథ్‌ తెలిపారు.logo