న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంది. ఎడమ మోకాలికి తీవ్రగాయమై శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ‘నా ఎడమ మోకాలి ఎముకల్లో పగుళ్ల వల్ల తీవ్ర గాయమైనట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ వారంలో శస్త్రచికిత్స చేయించుకుంటా. ఒలింపిక్స్‌కు రెండు నెలలే ఉండడంతో మళ్లీ కోలుకొని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ఈ ఏడాది విశ్వక్రీడల్లో పాల్గొనడం సాధ్యమయ్యే పని కాదు’అని మారిన్ మంగళవారం ట్వీట్ చేసింది. 2019లోనూ కుడి మోకాలి గాయం వల్ల కరోలినా దాదాపు 9 నెలలు ఆటకు దూరమైంది.