గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 19:04:20

వ‌ర‌ద బాధితులకు యుద్ధ ప్రాతిప‌దిక‌న సాయం : సీఎం కేసీఆర్

వ‌ర‌ద బాధితులకు యుద్ధ ప్రాతిప‌దిక‌న సాయం : సీఎం కేసీఆర్

  • వ‌ర‌ద మృతుల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం
  • కూలిన ఇండ్ల‌కు కొత్త ఇళ్ల‌ మంజూరు
  • ముంపు ప్రాంతాల్లో నిత్యావ‌స‌ర స‌రుకుల‌తో పాటు ప్ర‌తి ఇంటికి మూడు రగ్గులు

హైద‌రాబాద్ : భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై సీఎం గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష స‌మావేశం నిర్వహించారు. కొన‌సాగుతున్న‌ సహాయ, పునరావాస చర్యలను సీఎం సమీక్షించారు. రాబోయే  రోజుల్లో చేయాల్సిన పనులను నిర్దేశించారు. హైదరాబాద్‌లో ఎక్కువ ప్రభావం ఉన్నందున జీహెచ్ఎంసిలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ స‌మావేశంలో మంత్రులు కేసీఆర్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, జెన్ కో సీఎండీ దేవులపల్లి  ప్రభాకర్ రావు, ఎస్.పీ.డీ.సీ.ఎల్. సీఎండి రఘుమారెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ద‌న్ రెడ్డి, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఎంఏయుడీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జల వనరులశాఖ ఈఎన్‌సీ మురళీధర్ రావు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ( చూడండి : కేసీఆర్‌కు తప్ప ఎవ్వనికి ఓటెయ్య అంటున్న తాత.. వీడియో )

జీహెచ్ఎంసీకి త‌క్ష‌ణం రూ. 5 కోట్లు విడుద‌ల‌

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్ఎంసీకి రూ. 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తామ‌న్నారు. లోతట్టు ప్రాంతాలు, అపార్ట్‌మెంట్ సెల్లార్లలో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాల‌న్నారు. ఆ త‌ర్వాత మాత్ర‌మే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. 

హైదరాబాద్ నగరంలో వరదల పరిస్థితిని గమనిస్తే చాలా చోట్ల చెరువుల ఎఫ్.టి.ఎల్. పరిధిలో ఏర్పాటైన కాలనీలే జలమయమయ్యాయని సీఎం అన్నారు. అపార్టుమెంట్ల‌ సెల్లార్లలో నీళ్లు నిలవడం వల్ల కూడా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇక నుంచి అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా ఉండే ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ఇండ్లపై హై టెన్షన్ లైన్లు పోయే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైన్ల తొలగింపునకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్‌శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. 


logo