శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Sep 25, 2020 , 01:57:48

వక్ఫ్‌ భూములు ఆటోలాక్‌

వక్ఫ్‌ భూములు ఆటోలాక్‌

  • ఆ స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయవద్దు
  • భవనాలకు ఎన్వోసీ ఇవ్వొద్దు
  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వక్ఫ్‌ భూములను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో నూతన రెవెన్యూ బిల్లుపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. వక్ఫ్‌ భూములను పరిరక్షిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఆటోలాక్‌ చేస్తామని సభకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం వక్ఫ్‌ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వక్ఫ్‌  స్థలాలలో ఎవరైనా భవనాలు నిర్మించడానికి అనుమతి కోసం దరఖాస్తుచేసినా, ఎన్వోసీలకు ధరఖాస్తుచేసినా ఇవ్వకూడదని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఆదేశిస్తూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. వక్ఫ్‌ భూములను సెక్షన్‌ 22-ఏ పరిధిలో చేరుస్తూ ‘ధరణి’ పోర్టల్‌లో అటోలాక్‌ చేస్తున్నట్టు ఉత్తర్వులలో స్పష్టంచేశారు. వక్ఫ్‌ బోర్డ్‌ సీఈవో వెంటనే జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులకు వక్ఫ్‌ భూములు, స్థలాల వివరాలను పంపించాలని ఆదేశించారు. మైనార్టీ సంక్షేమశాఖ ప్రయోజనాల కోసం ఆథరైజ్‌చేసిన వాటికి మినహా ఏ ఒక్క నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వకూడదని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను ఆదేశించారు. వక్ఫ్‌ భూముల పరిరక్షణకు ఇచ్చిన ఆదేశాలను అధికారులంతా నిక్కచ్చిగా అమలుచేయాలని పేర్కొన్నారు.