శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:43:35

వక్ఫ్‌, ఆలయ భూముల రిజిస్ట్రేషన్లు బంద్‌

వక్ఫ్‌, ఆలయ భూముల రిజిస్ట్రేషన్లు బంద్‌

  • నేటినుంచే నిర్ణయం అమల్లోకి
  • అసైన్‌ విధానం అశాస్త్రీయం
  • ఆర్వోఎఫ్‌ఆర్‌ మోసం చెయ్యొద్దు
  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వక్ఫ్‌ భూములు, దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను తక్షణం బంద్‌ పెడుతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. శనివారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘వక్ఫ్‌ భూముల విషయంలో చాలా కథ ఉన్నది. వక్ఫ్‌ భూములను ఎవరూ పట్టించుకోలేదు. 1962 నుంచి 2003 వరకు సర్వేలు చేస్తనే పోయిన్రు, గెజిట్‌లు ఇస్తనే ఉన్నరు. ఇంకో సర్వే చేసిన్రు. ఇన్నేండ్లు చేసుకుంటపోతే వక్ఫ్‌ భూములు బతుకుతయా? ఈ భూముల విషయంలో అరాచకం జరిగింది. 77,538 ఎకరాల భూములు వక్ఫ్‌కు చెందినవని ప్రభుత్వం పేర్కొన్నది. వీటిలో 57 వేల ఎకరాలు కబ్జాలో ఉన్నది. 6,935 మంది కబ్జా చేసినవారు ఉన్నరు. వీరిలో 6024 మందికి నోటీసులు ఇచ్చిన్రు. 2,080 మందికి విడుదల ఉత్తర్వులు వచ్చినయి. పది ఎఫ్‌ఐఆర్‌లు అయినయి. దీనిపై ఎవరూ పట్టించుకోలేదు. నేను 30 ఏండ్లుగా సభలో ఉంటున్న. అప్పటినుంచి ఇది ఇలాగే ఉన్నది. ఎండోమెంట్‌ భూములు 87,235 ఎకరాలు ఉన్నయి. 21 వేల ఎకరాలు లీజులో, 23 వేల ఎకరాలు అర్చకుల పేరిట ఉన్నయి. 22 వేల ఎకరాలు కబ్జాల్లో ఉంది. సాగుకు పనికిరానివి 19 వేల ఎకరాలు ఉన్నయి. ఇది పెద్ద గందరగోళం. వక్ఫ్‌, ఎండోమెంట్‌ భూములకు సంబంధించి క్రయవిక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నం. రేపు ఉదయం (శనివారం) నుంచి ఈ భూములు రిజిస్టర్‌ కావు. వీటికి ఎన్వోసీ ఇవ్వరు. మున్సిపల్‌, గ్రామపంచాయతీ అనుమతులు ఇవ్వరు. ఈ భూములన్నింటికీ సీల్‌ వేస్తం. వీటిపై రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో ఆటోలాక్‌ పెడుతున్నం. సెక్షన్‌ 22 ఏ కింద ఈ నిర్ణయం తీసుకుంటున్నం. డిజిటల్‌ సర్వే తర్వాత అన్నింటికీ పరిష్కారం వస్తుంది.

అసైన్‌ ఆశాస్త్రీయం

అసైన్డ్‌ భూముల విషయంలో గతంలో అవలంబించిన విధానం చాలా అశాస్త్రీయం. ఇష్టారాజ్యంగా చేశారు. చాట్ల తౌడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్లుగా ఉన్నది. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 1500 ఎకరాలుంటే 9 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన్రు. మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 200 ఎకరాలు ఉంటే ఆరేడు వందల ఎకరాలకు ఇచ్చేసిన్రు. లక్ష రూపాయలకు ఎకరం అని బిస్కెట్లు అమ్మినట్లు చేసిండ్లు. ఎన్నికలు వస్తన్నయంటే సర్టిఫికెట్లు ఇచ్చుడు. నేను పుట్టిన ఊరిలో 91 ఎకరాల పరంపోగు ఉంటే 120 ఎకరాలకు 136 మందికి సర్టిఫికెట్లు ఇచ్చిన్రు. నేను ఉంటున్న ఎర్రవల్లిలో నా పక్కనే దళితులకు 370 ఎకరాలు ఇస్తే నేను స్వయంగా పరిశీలించిన. అభివృద్ధిచేయాలని చెప్పిన. మొత్తం డ్రిప్‌ ఇరిగేషన్‌ పెట్టాలని సూచించిన. అది కూడా ఎవరు ఎక్కడ ఉన్నరో తెల్వదు. ఒకాయన ఐదెకరాలు దున్నుతున్నడు, ఇంకొకాయన మూడెకరాలు దున్నుతున్నడు. కాగితం ఉన్న వాళ్లు ఇప్పటివరకు రాలేదు. దాంట్లో ఒక బాట లేదు, గెట్టు చూపెట్టలేదు. బాట లేకుంటే ఈ కొసకు ఉన్నోడు అ కొసకు ఎట్ల పోవాలె? పేద కుటుంబానికి ఆర్థికంగా వనరుగా ఉండేందుకు భూమి ఇస్తరు. కానీ అసైన్‌ అంటే రాజకీయం అయిపోయింది. పోటీపడి ఎక్కువ పంచినమని చెప్పుకున్నరు. భూమి తక్కువ, ఇచ్చిన సర్టిఫికెట్లు ఎక్కువ. ఇప్పుడు తలకాయలు పగులగొట్టుకునే పరిస్థితులు వచ్చినయి. మేళాలు పెట్టి ఖాళీ కాగితాలు ఇచ్చేది. సర్వే లేకుంట, గెట్టు చూపెట్టకుంట, పొజిషన్‌ చూపించకపోవడం.. ఇట్ల రాజకీయపరమైన అసైన్‌మెంట్లు పరంపరగా ఏండ్ల తరబడి జరిగినయి. అదిప్పుడు జటిల సమస్యగా మారింది. అన్ని తప్పులకు పరిష్కారం రావాలి. ఇవి ఏండ్లుగా వస్తున్నవి. ఒక్కరోజులోనే పోదు. ఒక్కొక్కటిగా పోతయి. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు సమావేశమై దళితులు, గిరిజనులు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారనే అంశాలతో నివేదిక తయారుచేయాలి. మనం నిర్ణయాలు తీసుకుని వారిపై రుద్దడం కాకుండా వారు ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవాలి.

ఆర్వోఎఫ్‌ఆర్‌ మోసం చెయ్యొద్దు

అటవీ భూముల విషయంలో అడవి బిడ్డలను మోసం చెయ్యొద్దు. అటవీచట్టం పూర్తిగా కేంద్రం చట్టం. దాంట్లో మన పాత్ర చాలా తక్కువ. ఆర్వోఎఫ్‌ఆర్‌ను కూడా రాజకీయ దందా చేసిన్రు. గతంలో కొందరికి ఇచ్చిన్రు. ఎమ్మెల్యేలు వచ్చి ఆర్వోఎఫ్‌ఆర్‌ వారికీ రైతుబంధు ఇవ్వాలని కోరితే ఇచ్చినం. మాకు ప్రజలను మోసంచేసే అలవాటు లేదు. అటవీ భూమి యాజమాన్యం ఎప్పటికీ మారదు. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా సర్టిఫికెట్లు కావు. ప్రజలు ఆ భ్రమలో ఉండొద్దు. అటవీ భూముల్లో ఫలాల చెట్లు అవీ పెట్టుకుని ఫలసాయం పొందాలి తప్పితే పట్టా భూములు కావు. పని చేసుకోవడానికి వీలు కల్పించే పత్రాలు మాత్రమే అవి. ప్రజలను మోసం చేయకుండా వారికి చెప్పాలె. 2.60 లక్షల ఎకరాలకు సంబంధించి 81 వేల మంది ఆర్వోఎఫ్‌ఆర్‌ రైతులకు కూడా రైతుబంధు ఇచ్చినం. అడవులు దున్నుకుంటపోతె ఇబ్బంది అయితది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గొత్తికోయలు వచ్చి అడవిని నరికి ఉంటున్నరు. మన గిరిజనులు ఎటు పోవాలె? అడవులు పోతే ఏం కావాలె? ఎన్ని చెట్లు పెట్టినా సహజ అడవికి సాటిరాదు. రాష్ట్ర ప్రభుత్వం సహజ అడవిని పెంచుతున్నది. గజ్వేల్‌ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల అడవిని పునరుద్ధరించింది. హైదరాబాద్‌ను రక్షించే నర్సాపూర్‌ అడవులను గత ప్రభుత్వాలు నాశనం చేసినయి. ఇప్పుడు రక్షించి పునరుజ్జీవంచేస్తున్నం. ఇప్పటికే ఇచ్చిన ఆర్వోఎఫ్‌ఆర్‌ రైతులకు ఇబ్బంది రానియ్యం. ధరణి పోర్టల్‌లో ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములకు ప్రత్యేకంగా క్లాజ్‌ పెడుతం. దీనివల్ల సాధారణ రైతుల లాగే సబ్సిడీలు వస్తయి. పోడు చేసుకున్నదానికి ముగింపు కావాలి. ఆర్వోఎఫ్‌ఆర్‌ ఇస్తామని గతంలోనే చెప్పిన. కరోనా వల్ల ఆగిపోయింది. అన్ని స్థాయిల అధికారులతో కలిసి నేనే స్వయంగా వచ్చి పరిష్కరిస్తం. ఇప్పుడున్న వారికి ఇచ్చి ముగింపు చెప్తం. ఆ తర్వాత ఎవరికీ ఇవ్వం.


logo