ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 01:30:11

పనిచేసే ప్రభుత్వానికే ఓటేయాలి

పనిచేసే ప్రభుత్వానికే ఓటేయాలి

  • ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి 

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ: పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేయడం ద్వారా ఆ సర్కారును మరింత బలపరిచినట్లవుతుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు మరిపెడలో నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎంపీ కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, శంకర్‌నాయక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో దాదాపు రూ.60 వేల కోట్లు వెళ్తున్నాయని, కేంద్రం మాత్రం రాష్ర్టానికి రూ.10 వేల కోట్లు ఇచ్చి అంతా తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. 

మహారాష్ట్ర తర్వాత తెలంగాణ నుంచే కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వెళ్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు అడగడానికి వచ్చే బీజేపీ నాయకులను మీకెందుకు ఓటు వేయాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు వివిధ కార్పొరేషన్‌ సంస్థల్లో ఈ ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగ భృతిని ప్రభుత్వం అమలు చేస్తుందని, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు తప్పకుండా అమలుచేస్తారని తెలిపారు.