బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 01:31:14

వలస విధానానికే ఓటు!

వలస విధానానికే ఓటు!

  • నిపుణులు రావడానికి అనుకూలంగా వలస విధానముండాలి
  • నూతన అమెరికా ప్రభుత్వం నుంచి భారతీయులు కోరుకునేది అదే
  • తెలంగాణ ఎన్నారై, అమెరికా పారిశ్రామిక వేత్త రవి పులి  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అమెరికాలో నూతన ప్రభుత్వం డెమోక్రాట్ల ఆధ్వర్యంలో ఏర్పడినా, రిపబ్లికన్ల ఆధ్వర్యంలో ఏర్పడినా భారతీయులు కోరుకునేది అత్యుత్తమ వలస విధానమేనని వరంగల్‌ జిల్లాకు చెందిన ఎన్నారై పారిశ్రామిక వేత్త, ఇంటర్నేషనల్‌ సొల్యూషన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌-సీఈవో రవి పులి అన్నారు. ప్రతిభావంతులు రావడానికి అనుకూలమైన వలస విధానాన్ని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. యూఎస్‌-ఇండియా సాలిడారిటీ మిషన్‌ (యూఎస్‌ఐఎస్‌ఎం) సంస్థను నెలకొల్పి అమెరికాలో చిక్కుకున్న భారతీయులు ముఖ్యంగా తెలంగాణ వారిని ప్రత్యేక విమానాల ద్వారా రవి పులి హైదరాబాద్‌కు పంపే ఏర్పాట్లు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

ఎవరొచ్చినా అదే ముఖ్యం..

ట్రంప్‌, బిడెన్‌ ఎవరు వచ్చినా భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమివ్వాలని కోరుకుంటున్నాం. ఒక భారతీయుడిగా అమెరికా వలస విధానంలో భారతీయులకు ప్రాధాన్యం లభించాలని కోరుకోవడంలో తప్పులేదు. ప్రతిభావంతులు ఇక్కడికి రావడం వల్లే అమెరికా గొప్ప దేశంగా ఎదిగింది. ఆ స్ఫూర్తిని కొనసాగించాలి. ప్రతిభావంతులకు అనుకూలంగా వలస విధానం ఉండాలి. అలా జరిగితే సహజంగానే ప్రతిభ, నైపుణ్యం కలిగిన భారతీయులకు అవకాశాలు పెరుగుతాయి. హెచ్‌1బీ నిబంధనల్లో మార్పులు జరుగుతున్నాయి. అయితే వీసాల కోటా మాత్రం తగ్గలేదు. వలస విధానం విషయంలో రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్ల విధానాలే సరళీకృతంగా ఉంటాయి. ట్రంప్‌ సర్కారు అమలుచేసే కఠిన నిబంధనలతో భారతీయుల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చు. కమలా హ్యారిస్‌కు ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం ఇవ్వడం డెమోక్రాట్లకు కచ్చితంగా లాభిస్తుందని చెప్పవచ్చు. భారతీయ, జమైకా మూలాలు ఆమెకు కలిసివస్తాయి.  

వచ్చే ముందు.. నిబంధనలు తెలుసుకోవాలి..

అమెరికాకు రావాలనుకునే తెలంగాణ విద్యార్థులకు మేమిచ్చే సలహా ఏంటంటే.. ముందుగా ఇక్కడి నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. చట్టాలను అధ్యయనం చేయాలి. గుర్తింపు పొందిన, ప్రముఖ విద్యాసంస్థలనే ఎంపిక చేసుకోవాలి.