గురువారం 28 మే 2020
Telangana - May 08, 2020 , 01:26:54

విశాఖలో మహా విషాదం

విశాఖలో మహా విషాదం

  • ఎల్జీ పాలిమర్స్‌లో ైస్టెరిన్‌ గ్యాస్‌ లీక్‌  
  • 11 మంది మృతి.. 1000 మందికి అస్వస్థత
  • 3 కిలోమీటర్లు విస్తరించిన విషవాయువు
  • ఊపిరాడక ప్రజల హాహాకారాలు
  • ఉన్నచోటే మరణించిన మూగజీవాలు
  • మృతుల కుటుంబాలకు ఏపీ సర్కారు కోటి పరిహారం
  • బాధితులకు సీఎం జగన్‌  పరామర్శ
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌

ఉప్పెన తరిమినట్టు విరుచుకుపడిన ఉపద్రవంతో  సుందర సాగరతీరం కకావికలమైంది! నగరం నిద్రపోతున్న వేళ పడగవిప్పిన విషగాలికి పట్టలేని శోకంతో విశాఖపట్నం విలవిల్లాడింది! కమ్మని కలల్లో తేలియాడుతున్న సమయంలో పెను విషాదం సంభవించింది! కొందరు నిద్రలోనే నిస్తేజులయ్యారు! నిద్రలేచినవారు ఏం జరుగుతున్నదో పసిగట్టేలోపే.. శరీరంలోకి చొరబడిన విషవాయువు.. ఊపిరితిత్తులను పిండేసింది. వందల సంఖ్యలో మనుషులను అతలాకుతలం చేసింది! పిల్లలను, ప్రాణాలను అరచేతబట్టుకుని పరుగులు తీసిన అనేకమంది.. వెంటాడిన విషవాయువు ప్రభావానికి రోడ్డుమీదే సోలిపోయారు! కొందరు ఊపిరిసలపక.. నురగలు కక్కుకుంటూ అక్కడే ప్రాణాలు వదిలేశారు. ఎటు చూసినా బాధితుల హాహాకారాలతో సముద్ర ఘోష సైతం మూగబోయింది! ఒకనాటి భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను గుర్తుకు తెచ్చిన ఈ ఘోరకలికి విశాఖపట్నంలోని గోపాలపట్నం కేంద్రబిందువైంది. ఇక్కడి ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గురువారం తెల్లవారుజామున లీకైన స్టెరిన్‌ వాయువు.. పదకొండు మందిని బలిగొనగా.. పెద్దసంఖ్యలో చిన్నారులు సహా వందల మంది దవాఖానలపాలయ్యారు.  


ఆర్తనాదాలు.. హాహాకారాలు. చూస్తుండగానే విరుచుకుపడిపోతున్న ప్రజలు. ప్రాణాలు దక్కించుకొనేందుకు పరుగులు. ఉన్నచోటనే ప్రాణాలు విడిచిన పశుపక్ష్యాదులు. నల్లగా మారిపోతున్న చెట్టూచేమా. అంబులెన్సుల మోతలు. సైరన్‌ కూతలు. అప్పటివరకూ చల్లగా హాయినిచ్చిన గాలి.. క్షణాల్లో మృత్యుదేవతగా మారిపోవటంతో మరుభూమిగా మారిన దృశ్యాలు.. విశాఖపట్నంలో గురువారం ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో జరిగిన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం పరిధి ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో తెల్లవారుజామున విషవాయువులు లీక్‌ కావటంతో 11 మంది మరణించారు. దాదాపు 1000 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమచారం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఏపీ సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన విశాఖపట్నం చేరుకొని బాధితులను పరామర్శించారు. 1984నాటి భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను తలపించిన ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం స్పందించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఈ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎల్జీ పాలిమర్స్‌ సంస్థపై పోలీసులు కేసు నమోదుచేశారు. రాత్రి పొద్దుపోయాక ప్లాంట్‌ నుంచి మరోసారి పొగలు వెలువడ్డాయి.

తప్పిన పెను ప్రమాదం 

ఈ దుర్ఘటనపై అధికారులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.  ఉదయం 3.30కి ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌కాగా 5.30 వరకు అదుపులోకి తెచ్చారు. 800 మందికిపైగా దవాఖానలకు తరలించగా వారిలో 250 మందికి ఇంకా చికిత్స అందిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతంసవాంగ్‌ తెలిపారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్యాస్‌ ప్రభావంతో గ్రామంలోని చెట్లన్నీ మాడిపోగా, మూగ జీవాలు ఉన్నచోటే ప్రాణాలు విడిచాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా 40 రోజులుగా ప్లాంట్‌ మూసి ఉండటంతో లీకేజీ ఏర్పడి నట్లు   భావిస్తున్నారు. 

మృతులకు రూ.కోటి పరిహారం

మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి రూ.10 లక్షలు, రెండు నుంచి మూడు రోజు లు దవాఖానలో ఉండే పరిస్థితి ఉన్నవారికి రూ.లక్ష, స్వల్ప అస్వస్థతకు గురైనవారికి రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘట నపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం 

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విశాఖ గ్యాస్‌ లీక్‌ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. ఈ ఘటన విషాదకరం అని రామ్‌నాథ్‌ కోవింద్‌, వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారులతో సమీక్షిస్తూ.. ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు సంతాపం తెలిపారు. 

విశాఖ ఘటన దురదృష్టకరం

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

తీవ్ర షాక్‌కు గురయ్యా

విశాఖపట్నంలో గ్యాస్‌ లీకేజీ బాధితుల వీడియోలు చూసి తీవ్ర షాక్‌కు గురయ్యాను. గ్యాస్‌ లీకేజీ ఘటనలో చనిపోయినవారికి సంతాపం తెలుపుతున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. 2020ని భయంకరమైన సంవత్సరం. ఇప్పటికే కరోనా మహమ్మారి వెంటాడుతుండగా.. ఇప్పుడు విశాఖపట్నం గ్యాస్‌ లీకేజీ చోటుచేసుకున్నది.

- ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు 

విశాఖ ప్రమాదంపై  దిగ్భ్రాంతి

విశాఖ గ్యాల్‌ లీకేజీ ఘటనపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్‌ బోంగ్‌-కిల్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్‌కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోండి: పర్యావరణవేత్తలు

విశాఖపట్నం: పాలిమర్స్‌ కెమికల్‌ ప్లాంట్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ైస్టెరిన్‌ వాయువులో టాక్సిక్‌ (విష వాయువు) పరిమాణం అధికంగా ఉంటుందని ఈ వాయువు పీల్చిన వారు వెంటనే అనారోగ్యానికి గురవుతారని, దాంతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని తెలిపారు. ైస్టెరిన్‌ వాయువు గాలిలోని ఆక్సిజన్‌తో సంయోగం చెందితే ైస్టెరిన్‌ డైఆక్సైడ్‌గా మారి మరింత ప్రమాదకరంగా మారుతుందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ సునీత నారాయణ్‌ హెచ్చరించారు. ప్రస్తుతం గాలిలో ైస్టెరీన్‌ ఇంకా ఉన్నదని, స్థానిక ప్రజలు తడి మాస్కులను ధరించడం మంచిదని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ పరిశోధకురాలు సౌందరమ్‌ రామనాథమ్‌ తెలిపారు. 


logo