శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 01:27:46

బడుగులపై మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం

బడుగులపై మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం

హన్మకొండ : దేశంలో బడుగు బలహీన వర్గాలపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నా రు. బుధవారం హన్మకొండ ఆర్‌ఈసీ సమీపంలోని మయూరి గార్డెన్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భం గా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం యువతను పక్కదారి పట్టిస్తున్నదని, ఆయన ప్రధానిగా ఉండి దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రేణులకు సూచించారు. రానున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రుణ విముక్తి కమిటీ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

చారిత్రక నగరికి భద్రకాళి బండ్‌ తలమానికం.. 

చారిత్రక వరంగల్‌ నగరానికి భద్రకాళి బండ్‌ తలమానికంగా నిలుస్తున్నదని బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. వరంగల్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి ఆయన భద్రకాళి బండ్‌ను  సందర్శించారు. భద్రకాళి చెరువు చుట్టూ చేపట్టిన సుందరీకరణ పనులు అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారు. రాబోయే రోజుల్లో సినిమా షూటింగ్‌లకు నెలవుగా ఈ బండ్‌ మారుతుందని అభిప్రాయపడ్డారు.