మంగళవారం 19 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 01:22:54

విశాలాంధ్ర ఎడిటర్‌ కన్నుమూత

విశాలాంధ్ర ఎడిటర్‌ కన్నుమూత

  • ముత్యాల ప్రసాద్‌ మృతికి పలువురి సంతాపం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విశాలాంధ్ర సంపాదకుడు, సాహితీవేత్త, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ముత్యాల ప్రసాద్‌ (54) మంగళవారం ఏపీలోని విజయవాడలో కరోనాతో తుదిశ్వాస విడిచారు. వైరస్‌ బారినపడిన ఆయన 20 రోజులుగా ప్రభుత్వ కొవిడ్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం కలటూరుకు చెందిన ముత్యాల ప్రసాద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. విద్యార్థి దశలో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు. దాసరి నాగభూషణరావు ప్రభావంతో 1990లో విశాలాంధ్ర దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరి 2006 వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. 

అనంతరం సాక్షి దినపత్రికలో చేరారు. విశాలాంధ్ర ప్రధాన కార్యాలయం విజయవాడకు మారిన తర్వాత 2014లో ఆ పత్రిక సంపాదక బాధ్యతలు చేపట్టారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఐజేయూ జాతీయ సమితి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ముత్యా ల ప్రసాద్‌ భౌతికకాయానికి ప్రజాశక్తి ఎడిటర్‌ శర్మ, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్షుడు ఎస్‌ వెంకట్రావు నివాళులర్పించారు. సీపీఐ మాజీ జాతీ య ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, చాడ వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు.