శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 07:57:10

గడ గడ.. నిద్రలేకుండా చేస్తున్న గబ్బిలం

గడ గడ.. నిద్రలేకుండా చేస్తున్న గబ్బిలం

  • సార్స్‌, నిఫా వైరస్‌లకు కూడా అదే కారణం
  • కరోనా విస్తరణకూ దానిపైనే అనుమానాలు
  • పుణె ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు
  • తెలంగాణలో కూడా నమూనాల సేకరణ 

నలుపు రంగులో కాళ్లు పైకి, తల కిందికి వేలాడేసి నిద్రపోతూ.. చూడటానికే భయానకంగా కనిపించే ఆ నిశాచరజీవి నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. పొద్దంతా నిద్రపోయి రాత్రంతా ఆహారం కోసం వేటాడే ఆ జీవి విస్తరిస్తున్న వైరస్‌ కారణంగానే నేడు వేలసంఖ్యలో మనుషులు చనిపోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు మునుపు సార్స్‌, స్వైన్‌ఫ్లూ, నిఫా వంటి ప్రాణాంతక వైరస్‌ల వ్యాప్తికి, నేడు ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా విస్తరణకు కూడా అదే కారణమన్న వాదన వినిపిస్తున్నది. అసహ్యమైన ముఖాకృతితో.. కొందరు అపశకునంగా భావించే ఆ జీవి మరేదో కాదు.. గబ్బిలం.

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గబ్బిలాల నుంచే వైరస్‌ వస్తున్నదా లేక వాటి ద్వారా వైరస్‌ వ్యాపిస్తున్నదా అన్నదానిపై పలుదేశాలలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మనదేశంలో కూడా పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం పరిశోధకులు దేశవ్యాప్తంగా ఆయాప్రాంతాలలో పర్యటించి పలురకాల గబ్బిలాల నుంచి రక్తం, లాలాజలం నమూనాలను సేకరిస్తున్నారు. పుణె శాస్త్రవేత్తలు ఇటీవల తెలంగాణలో కూడా పర్యటించి గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించారు. 

నిఫాకు కారణం గబ్బిలాలే

రెండేండ్ల క్రితం కేరళలోని కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లో 17 మందిని బలిగొన్న నిఫా వైరస్‌కు కూడా పండ్లు తినే గబ్బిలాలే కారణమని నిర్ధారించారు. నిఫా కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడంతో వారి ఇంటి ఆవరణను శాస్త్రవేత్తలు పరిశీలించారు. అక్కడి బావిలో పెద్ద ఎత్తున గబ్బిలాలు ఆవాసం ఏర్పరచుకోవడం గుర్తించి, వాటి రక్తనమూనాలను సేకరించారు. నిఫా వైరస్‌కు గబ్బిలాలే కారణమని ఆ తరువాత పుణెలోని నేషనల్‌ వైరాలజి ఇన్‌స్టిట్యూట్‌ నిర్ధారించింది. 

వైరస్‌ ఎలా విస్తరిస్తుంది?

గబ్బిలాలు సగం తిని పడేసిన పండ్లను పందులు తినడం ద్వారా స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలిందన్న వాదన ప్రచారంలో ఉంది. హాంకాంగ్‌లో పందిమాంసం వండిన ఒక చెఫ్‌ మరో మహిళతో కరచాలనం చేయడం ద్వారా ఆమెకు స్వైన్‌ఫ్లూ వచ్చిందని, ఆమె నుంచి వ్యాధి క్రమంగా ఇతరులకు విస్తరించిందని అంటుంటారు. 2009లో పుట్టిన స్వైన్‌ఫ్లూ భారత్‌తోపాటు పలుదేశాలను ఇప్పటికీ గడగడలాడిస్తున్నది. స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 2010లో మహమ్మారిగా ప్రకటించింది. 

తెలంగాణకు పుణె శాస్త్రవేత్తలు

వైరస్‌లకు, గబ్బిలాలకు ఉన్న సంబంధంపై పరిశోధనలు చేస్తున్న పుణెలోని నేషనల్‌ వైరాలజి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు నాలుగు నెలల క్రితం తెలంగాణలో పర్యటించారు. పలు ప్రాంతాలలో వేర్వేరు గబ్బిలాలను గుర్తించి వాటి రక్త నమూనాలను, లాలాజలం నమూనాలను సేకరించారు. హైదరాబాద్‌లోని హైకోర్టు భవనం, ఉస్మానియా యూనివర్సిటీ, చిల్కూరు బాలాజీ దేవాలయం, మంజీరా నది, జనగామ తదితర ప్రాంతాలలో వివిధ రకాలకు చెందిన వందల సంఖ్యల గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించారని వన్యప్రాణి నిపుణులు శంకరన్‌ చెప్పారు. ఈ గబ్బిలాలద్వారా ఎటువంటి వైరస్‌లు ఉత్పన్నమవుతున్నాయి, వాటికి విరుగుడు ఏమిటి అన్నదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారని తెలిపారు. 

గబ్బిలాలలో పలురకాలు

గబ్బిలాలు జనసంచారంలేని పాడుపడిన బంగ్లాలు, చారిత్రక కట్టడాలు, పెద్దపెద్ద వృక్షాలను ఆవాసాలుగా చేసుకుంటాయి. పర్యావరణ పరిరక్షణలో తమవంతుగా సహకరిస్తుంటాయి.  తలకిందులుగా నిద్రపోయే క్షీరజాతికి చెందిన  ఈ జంతు జాతులు మన దేశంలో ప్రధానంగా 11 ఉన్నాయి. కేవలం పండ్లను తినేవి కొన్ని రకాలైతే క్రిమికీటకాలను తినేవి మరో రకం. కప్పలు, చేపలను తినేవి మరికొన్ని రకాలు. పండ్లను తినే గబ్బిలాలు విత్తనాలను విసర్జించడం ద్వారా చెట్ల వ్యాప్తికి దోహదపడుతాయి. ఇవి మానవులకు నేరుగా హాని తలపెట్టకపోయినా వైరస్‌ను మోసుకొచ్చే వాటిగా అనుమానిస్తున్నారు. వీటిపై సాగుతున్న పరిశోధనలు విజయవంతమైతే స్వైన్‌ఫ్లూతోపాటు కరోనాకు కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.


logo