మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 02:32:26

కొవిడ్‌ తగ్గితే.. లాంగ్‌ కొవిడ్‌!

కొవిడ్‌ తగ్గితే.. లాంగ్‌ కొవిడ్‌!

  • కోలుకున్న తర్వాతా వైరస్‌ ప్రభావం
  • ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల సమస్యలు
  • నెలల తరబడి అనారోగ్యంతో ఇబ్బంది

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనానుంచి కోలుకున్న చాలామంది పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటున్నది. వైరస్‌ బారినపడి కోలుకున్నవారు తర్వాత ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూస్తున్నట్టే మన రాష్ట్రంలోనూ ఉన్నాయి. లాంగ్‌ కొవిడ్‌ లేదా పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌గా పిలుచుకొనే ఈ ప్రభా వం నెలలపాటు బాధితుల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నది. దీర్ఘకాలిక సమస్యలు ప్రారంభం కావడంతో కోలుకున్నవారు సైతం దవాఖాన చుట్టూ తిరుగుతున్నారు. లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ వల్ల దీర్ఘకాలిక అలసట, మానసిక సామర్థ్యం కోల్పోవడంతోపాటు ఇతర శరీరాన్ని బలహీన పరిచే లక్షణాలు బహిర్గతమవుతున్నాయి. ఊపిరితిత్తులు బలహీనపడటం, గుండె సమస్యలు, దీర్ఘకాలంగా జ్వరం, అలసట, ఒంటి నొప్పులు, వాసన కోల్పోవడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైరల్‌ లోడ్‌ ఎక్కువై, కరోనాతో పోరాటంచేసి గెలిచినవారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ), అస్తమా లాంటి ఊపిరితిత్తుల సమస్యలున్నవారికి దీర్ఘకాల సమస్యగా మారుతున్నది. 

గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం

కరోనా తుంపర్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి, శ్వాససంబంధ వ్యవస్థను నాశనంచేస్తున్నదని మొదట గుర్తించారు. ఆ తర్వాత వైరస్‌చేస్తున్న నష్టం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటున్నదని అధ్యయనాలు చెప్తున్నాయి. దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలకు కరోనా దారి తీస్తుందంటున్నారు. వైరస్‌ తొలుత విజృంభిం చి శాంతించిన వుహాన్‌లో వైద్యులు కరోనా బాధితులపై జరిపిన అధ్యయనం గుండెకు కలి గే ముప్పును స్పష్టంచేస్తున్నది. కరోనా సోకిన 416 మందిలో 20 శాతం మందికి గుండె సంబంధ సమస్యలు వచ్చినట్లు తేలింది. కోలుకున్నవారిలో 20 శాతం మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్టు బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ స్పష్టంచేసింది. వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తులపై ఎక్కువగా ఉంటున్నది. కొవిడ్‌ నుంచి బయటపడ్డప్పటికీ వీరికి చికిత్స తప్పనిసరి అవుతున్నది. వారాలు, నెలలపాటు ఆక్సిజన్‌ సరఫరా అవసరం అందించాల్సి వస్తున్నది. వైరస్‌ ప్రభావం వల్ల ఊపిరితిత్తులు గట్టిపడి పల్మనరీ ఫైబ్రోసిన్‌ సమస్య తలెత్తుతున్నది. ఈ పరిస్థితిలో ఊపిరితిత్తులు సాగే గుణాన్ని కోల్పోవడంతో, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతున్నది. దీంతో దగ్గు, ఆయాసం వంటివి ఎక్కువవుతున్నాయి. ఈ సమయంలో ఊపిరితిత్తులు వైఫల్యంచెంది ప్రాణాపాయ స్థితి వచ్చే అవకాశం ఉన్నది. అందుకే కోలుకున్నవారు సైతం కొద్ది కాలం సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

సాధారణ స్థితికి రాలేకపోతున్నారు..

కరోనా బారినపడి కోలుకున్నవారిలో పెద్ద వయస్కుల్లో కొందరు తిరిగి సాధారణస్థితికి రాలేకపోతున్నారు. శరీరంపై వైరస్‌ దీర్ఘకాల ప్రభావం ఉంటుండటంతో రోజువారీ పనులు చేసుకునేందుకు సహకరించడం లేదు. లాంగ్‌ కొవిడ్‌ కారణంగా వేగంగా నడవడం, ఇంటి పనులు చేసుకోవడం ఇబ్బందిపడుతున్నారు. మెట్లు ఎక్కేందుకు కూడా శరీరం సహకరించడం లేదని బాధితులు వాపోతున్నారు. హైదరాబాద్‌ బాచుపల్లికి చెందిన వెంకటేశ్‌ కరోనా బారినపడి కోలుకున్నారు. నెలరోజులు గడిచినా ఆరోగ్యం చురుకుగా ఉండటం లేదు. దీనికి తోడు వాసన గుర్తించకపోవడం, స్వల్పంగా జ్వరం, ఒంటి నొప్పులు వేధిస్తున్నాయి. వైద్యుడిని సంప్రదిస్తే అది లాంగ్‌ కొవిడ్‌ ప్రభావం అని చెప్పారు. కొవిడ్‌ తగ్గిన తర్వాత జాగ్రత్తలు తప్పనిసరి అని వివరించారు.

కరీంనగర్‌కు చెందిన రాజేశ్‌ 15 రోజులు దవాఖానలో చికిత్స పొంది కరోనాను జయించారు. అయితే వైరస్‌ సోకి 40 రోజులు అవుతున్నా దాని దుష్ప్రభావం అలాగే ఉన్నది. నిద్రలేమి, నీరసం, ఆకలి మందగించడం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులను సంప్రదిస్తే.. వైరస్‌ ప్రభావం నెలలపాటు ఉంటుందని చెప్పి, అవసరమైన మందులు రాసి పంపించారు.

లాంగ్‌ కొవిడ్‌తో జాగ్రత్త

కరోనా నుంచి కోలుకున్నవారిలో కొందరు ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొందరికి జలుబు, జ్వరం, కండరాల నొప్పు లు ఉంటుండగా, మరికొందరికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. రక్తనాళాలాలు దెబ్బతినడంతో గాలి పీల్చుకునే శక్తి తగ్గుతున్నది. మరికొందరిలో రుచి, వాసన గ్రహించే శక్తి నెలన్నర అయినా రావడం లేదు. ఈ సమస్యలు ఎక్కువగా బీపీ, షుగర్‌, ఆయాసం సహా దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యలున్నవారిలో కనిపిస్తున్నాయి. వైరస్‌నుంచి కోలుకున్నవారు జీవన శైలిలో మార్పు చేసుకోవాలి. 

- డాక్టర్‌ పీ సతీశ్‌రెడ్డి, సీనియర్‌ కన్సల్టెంట్‌, కాంటినెంటల్‌ హాస్పిటల్‌


logo