సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 00:37:59

30 నిమిషాల్లోనే వైరస్‌ నిర్ధారణ!

30 నిమిషాల్లోనే వైరస్‌ నిర్ధారణ!

  • ఈఎస్‌ఐసీ, నిమ్స్‌, టీఐఎఫ్‌ఆర్‌ సంయుక్త ఆవిష్కరణ
  • ఐసీఎమ్మార్‌ అనుమతి రాగానే కేవలం రూ.300కే టెస్ట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నిర్ధారణ పరీక్షను అత్యంత వేగంగా కచ్చితత్వంతో అతి తక్కువ ఖర్చుతో చేసేందుకు ఆర్టీ- ల్యాంప్‌ అనే రోగనిర్ధారణ పరీక్ష విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఈఎస్‌ఐసీ ఎర్రగడ్డ దవాఖానలో ఈ విధానాన్ని ప్ర యోగాత్మకంగా పరీక్షించగా విజయవంతమైంది. కేవలం 30 నిమిషాల్లోనే కొవిడ్‌ ఉందా లేదా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్‌ పద్ధతిని వాడుతున్నారు. ఇందుకు 12 నుంచి 24 గంటలు పడుతున్నది. రూ.4,500 వరకు ఖర్చు అవుతున్నది. దీనిని అత్యాధునిక ప్రయోగశాలల్లోనే చేయాల్సి ఉంటుంది. 

కానీ, నిమ్స్‌, ఈఎస్‌ఐసీ, టీఐఎఫ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన లూప్‌ మీడియేటెడ్‌ ఐసొథర్మల్‌ అప్లికేషన్‌ మెథడ్‌ (ఆర్టీ- ల్యాంప్‌)తో  కొవిడ్‌ నిర్ధారణ పరీక్షను 30 నిమిషాల్లో వందశాతం కచ్చితత్వంతో చేయవచ్చు. ఇందుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుంది. ఆర్టీ- ల్యాంప్‌ విధానంలో పరీక్ష నాళికల్లో ముందుగానే రియేజెంట్‌ను పోస్తారు. ఇది గులాబీరంగులో ఉంటుంది. అనుమానిత వ్యక్తుల నుంచి స్వాబ్‌ (శ్లేష్మం) సేకరించి పరీక్షనాళికల్లో వేసి 60 డిగ్రీల వేడి నీటి చాంబర్‌లో 30 నిమిషాలపాటు ఉంచుతారు. వైరస్‌ ఉంటే పరీక్ష నాళికలోనే ద్రవం గులాబీరంగు నుంచి పసుపు వర్ణంలోకి మారుతుంది. వైరస్‌ లేకపోతే ద్రవం గులాబీ వర్ణంలోనే ఉంటుంది. ఈ పరీక్షను ల్యాబ్‌ ఉన్న అన్ని దవాఖానల్లో కొన్ని జాగ్రత్తలతో నిర్వహించవచ్చు. ఐసీఎమ్మార్‌ నుంచి అనుమతులు రాగానే టెస్టులు ప్రారంభిస్తామని నిమ్స్‌ ఆర్‌అండ్‌డీ హెడ్‌డాక్టర్‌ కే మధుమోహన్‌రావు తెలిపారు.


logo