గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:20:26

వైరస్‌ కంటే వైరల్‌ డేంజర్‌

వైరస్‌ కంటే వైరల్‌ డేంజర్‌

  • వైరస్‌ను మించి బాధిస్తున్న అతి ప్రచారం
  • కుంగుతున్న కరోనా బాధితులు, కుటుంబీకులు
  • సోషల్‌మీడియాలో హల్‌చల్‌పై భయాందోళన
  • మాటలతో భరోసా ఇవ్వాలంటున్న నిపుణులు

ఫ్రెండ్స్‌... నేను క్షేమంగా ఉన్నా. నాకు కరోనా రాలేదు. జ్వరం వస్తే దవాఖానలో చేరాను. టైఫాయిడ్‌ అని తేలింది. నాలుగు రోజుల చికిత్స తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాను. నాకు కరోనా రాలేదు. దయచేసి సోషల్‌మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు ప్లీజ్‌.తన ఫోన్‌ కాంటాక్ట్స్‌ అన్నింటికీ వాట్సాప్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి రెండ్రోజుల కిందట పంపిన వీడియో ఇది.

అందరికీ నమస్కారం. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ దవాఖానలో చికిత్స అందించారు. ఇప్పుడు మంచిగ ఉన్నాను. నా కుటుంబసభ్యులకు నెగెటివ్‌ వచ్చింది. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. కానీ, నాతోపాటు నా కుటుంబసభ్యులందరికీ కరోనా వచ్చిందని, నేను చికిత్సపొందుతూ చనిపోయానని సోషల్‌మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు. దయచేసి ఆ పోస్టులను ఎవరూ ఫార్వర్డ్‌ చేయొద్దు.

- హైదరాబాద్‌ బాలాపూర్‌లోని ఒక కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి వాట్సాప్‌లో వేడుకుంటూ చేసిన వీడియో ఇది.


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సోషల్‌మీడియా వేదికగా కొందరి అతి ప్రచారం తలనొప్పులు తెస్తున్నది. కరోనా బాధితులను, వారి కుటుంబసభ్యులను మానసికంగా కుంగదీస్తున్నది. అప్రమత్తం చేయాల్సిన ప్రచారం హద్దు మీరుతున్నది. ‘కొవిడ్‌-19 వైరస్‌తో ఈ రోజు దేశం మొత్తం యుద్ధం చేస్తున్నది. కానీ గుర్తుంచుకోండి.. మనం పోరాడాల్సింది రోగితో కాదు రోగంతో..’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరికి అవేమీ పట్టడంలేదు. దీంతో దుష్ప్రచారాన్నితట్టుకోలేక వాటిని నమ్మొద్దంటూ సామాజిక మాధ్యమాల వేదికగా స్వయంగా బాధితులే వేడుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సాధారణ ఫ్లూలు ప్రబలే ఈ వర్షాకాలం సీజన్‌లో చిన్నపాటి అనారోగ్యాలు అనేవి సహజమైనందున.. సోషల్‌మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పోస్టులతో కాకుండా మాటలతో భరోసా ఇవ్వాలని చెప్తున్నారు.

ఒక్కో పోస్టు వెనుక ఎన్నో కారణాలు

కరోనా బాధితుల సమాచారం, వీడియోలను వైరల్‌ చేసే ఒక్కొక్కరి మానసిక స్థితి ఒక్కోలా ఉంటుందని సైకాలజిస్టు డాక్టర్‌ జీసీ కవిత విశ్లేషిస్తున్నారు. 

  • తనకు తెలిసిన ఒక విషయాన్ని పదిమందితో పంచుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. కొందరు తెలిసిన కొంత సమాచారానికి మరింత జోడించి సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తారు. దాన్నుంచి ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తుంటారు. 
  • కొన్ని నెలలుగా కరోనాతో ఇంట్లోనే ఉంటూ ఫోన్‌లో పోస్టులను వైరల్‌ చేయడం ఒక విధిగా పెట్టుకుంటున్నారు. ఆ స్థానంలో తానుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేయడం లేదు. 
  • కొందరు ఉద్దేశపూర్వకంగా లక్ష్యాన్ని పెట్టుకొని అబద్ధాలు, అనవసర ప్రచారాన్ని చేస్తున్నారు.
  • నగరంలో ఒక కాలనీలోని వ్యాపారి స్వల్ప అనారోగ్యంతో దవాఖానలో చేరినా కొందరు ఇతర వ్యాపారులు దాన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఆ వ్యాపారి బిజినెస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

సామాన్యుడి మానసిక స్థితి భిన్నం

సమాజంలో సెలబ్రిటీలు, సామాన్యుల మా నసిక స్థితులు భిన్నంగా ఉంటాయని డాక్టర్‌ జీసీ కవిత తెలిపారు. ఉదాహరణకు.. బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ తనకు కరోనా పాజిటివ్‌ రాగానే దవాఖానలో చికిత్సపొందుతూ ఆ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టుచేశారు. ఆయన ట్వీట్‌కు ముక్కు మొహం తెలియని వారుకూడా ‘గెట్‌ వెల్‌ సూన్‌' అంటూ స్పందిస్తారు. కానీ ఒక సామాన్యుడి మానసిక స్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. తనకొచ్చిన ఆపదను, బాధను కుటుంబసభ్యులు, దగ్గరివారికి మినహా ఇతరులతో పంచుకునేందుకు, వారి సానుభూతిని కోరుకునేందుకు ఇష్టపడరు. కరోనా పాజిటివ్‌ వచ్చినపుడు సోషల్‌మీడియాలో తన పేరు, కుటుంబసభ్యుల వివరాలు వైరల్‌ అవుతుండటం వారిలో తీవ్ర భయాందోళనల్ని రేకెత్తిస్తున్నది. సమాజంలో తలెత్తుకునే పరిస్థితిలేదనే అభిప్రాయానికి వచ్చి మానసికంగా కుంగిపోతారు. అది వైరస్‌కంటే ఎక్కువ ప్రమాదకారిగా మారుతున్నది. వైరల్‌ చేసే వారూ సామాన్యులే. వారి మానసిక స్థితి కూడా అలాగే ఉంటుందనే అవగాహన వారిలో ఉండకపోవడం గమనార్హం.

సామాజిక బాధ్యతగా మెలగాలి

కరోనా లాక్‌డౌన్‌, ఇంట్లో నాలుగు గోడల మధ్యనే ఉండటం, సామాజిక అనిశ్చితి మనుషుల మానసిక స్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని సైకాలజిస్టు జీసీ కవిత చెప్తున్నారు. ఇన్ని రోజులు పూర్తిగా కుటుంబసభ్యులతో గడపటం అనేది గతంలో ఎన్నడూ అనుభవంలో లేనిదని, ఇదే అత్యధికుల్లో ఆందోళన  పెరుగడానికి కారణం అవుతున్నదని చెప్పారు. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో వెల్లడించే క్రమంలో గృహహింస పెరుగుతున్నదని అనేక సర్వేల్లో తేలిందని పేర్కొన్నారు. ఫోన్లకు అతుక్కుపోవడం మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతున్నదని చెప్పారు. అందుకే రోజులో కనీసంగా 2-3 గంటల పాటు వ్యక్తిగత సమయం (స్పేస్‌) ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ చేసి అనర్థాలకు ఆస్కారం ఇవ్వొద్దని చెప్పారు.


logo