బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:30:52

తెలంగాణ ప్రవాసులకు భరోసా

తెలంగాణ ప్రవాసులకు భరోసా

  • కార్యాచరణపై సమాలోచనలు 
  • బీఆర్కే భవన్‌లో వినోద్‌కుమార్‌, సోమేశ్‌కుమార్‌, విదేశాంగ మంత్రిత్వశాఖ ఓఎస్డీ రాజశేఖర్‌ భేటీ

హైదరాబాద్‌, జనవరి 8 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉంటున్న తెలంగాణవాసులకు పూర్తి రక్షణ కల్పించి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న విదేశాంగ మంత్రిత్వశాఖ ఐఆర్‌ఎస్‌ ఉన్నతాధికారి రాజశేఖర్‌, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, జీఏడీ ప్రొటోకాల్‌ కార్యదర్శి సర్దార్‌ అరవిందర్‌సింగ్‌, ఇతర అధికారులు శుక్రవారం బీఆర్కే భవన్‌లో సమావేశమయ్యారు. విదేశాల్లో ఉంటున్న, ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లోని తెలంగాణవారికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు అనుసరించాల్సిన విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. విదేశీ వ్యవహారాల్లో రాష్ర్టాలతో సమన్వయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వశాఖలో ప్రత్యేకంగా ఒక డివిజన్‌ను ఏర్పాటుచేసింది. 

ఈ విభాగానికి ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ)గా రాజశేఖర్‌ అనే ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ ఉన్నతాధికారిని నియమించింది. వినోద్‌కుమార్‌, సోమేశ్‌కుమార్‌ ఆహ్వానం మేరకు రాజశేఖర్‌ శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. గల్ఫ్‌ సహా ఇతర దేశాల్లో ఉంటున్న తెలంగాణవాసులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి, వారికి అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రత్యేక అధికారుల బృందం అప్రమత్తంగా ఉండేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధానంగా గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లినవారికి నిత్యం అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అక్కడ ఏ కారణాలతోనైనా చనిపోయినా వారి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

న్యాయపరమైన, జైలు పాలవడం వంటి ఇతర ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులు స్పందించేలా ఏర్పాట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. విదేశాల్లో తెలంగాణవాదులు జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకొనేందుకు దౌత్యపరంగా సహకరించాలని, చారిత్రక, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా తోడ్పాటు అందించాలని సూచించారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించాలని, విదేశీ వర్సిటీలను రాష్ట్రంలోని హైదరాబాద్‌ సహా మిగతా జిల్లాల్లో నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని నిర్ణయానికి వచ్చారు. విదేశాల్లోని తెలంగాణవాసులకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వశాఖ ఓఎస్డీ రాజశేఖర్‌ను కోరారు.


logo