సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 13:58:44

ఇది విని సంతోషం కలిగింది : వినోద్‌ కుమార్‌

ఇది విని సంతోషం కలిగింది : వినోద్‌ కుమార్‌

కరీంనగర్‌ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రామడుగు మండలం వెదిర గ్రామం మీదుగా వెళ్తున్న వినోద్‌కుమార్‌ పొలంలో పనిచేస్తున్న కూలీలను చూసి ఆగారు. పత్తి విత్తనాలు పెడుతున్న కూలీలను చూసి కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. కాసేపు వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పిన విధంగా పంటలు వేస్తున్నారా అని అడగగా అవును అని రైతులు సమాధానమిచ్చారు. ఇది విని తనకు ఎంతో సంతోషం కలిగిందని వినోద్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రైతులు సాగుబాట పట్టడం హర్షనీయమని పేర్కొన్నారు.

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ నిపుణులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లోని రైతులకు అవగాహన నిమిత్తం నియోజకవర్గ, మండలస్థాయి సదస్సులను నిర్వహిస్తున్నారు. సన్న రకాల వరి, కందులు, పత్తికి మార్కెట్లో డిమాండ్‌ ఉందని కావునా ఇటువంటి డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాల్సిందిగా ప్రభుత్వం సూచిస్తోంది. మక్కల నిల్వలు రెండేళ్లకు సరిపడా ఉన్నాయని కావునా మొక్కజొన్న వేసి రైతులు నష్టపోవద్దని సూచిస్తున్నారు.


logo