బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 01:46:16

కష్టకాలంలోనూ ప్రగతి వైపు

కష్టకాలంలోనూ ప్రగతి వైపు

  • కరోనా పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలి
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ 
  • ‘ఖనిజ పరిశ్రమ - కరోనా ప్రభావం’పై ఐఈఈ వెబినార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ ఖైరతాబాద్‌: ప్రస్తుత విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని ప్రగతికి అనువుగా మార్చుకొనేందుకు వ్యూహరచన చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ చెప్పారు. కొవిడ్‌-19 ప్రభావంతో చైనావంటి దేశాల్లోని విదేశీ పరిశ్రమలు భారత్‌ వైపు చూస్తున్నాయని, దీన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. శనివారం ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా (ఐఈఈ) తెలంగాణశాఖ ఆధ్వర్యంలో ‘ఖనిజ పరిశ్రమపై కొవిడ్‌-19 ప్రభావం’ అంశంపై జరిగిన వెబినార్‌లో వినోద్‌కుమార్‌ మాట్లాడారు. ఖనిజ పరిశ్రమల ఇంజినీర్లు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. కరోనా ఆర్థిక కల్లోలంపై పోరాడి విజయం సాధించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి పిలుపునిచ్చారు. వెబినార్‌కు ఐఈఈ చైర్మన్‌ డాక్టర్‌ జీ రామేశ్వర్‌రావు అధ్యక్షత వహించగా.. సింగరేణి కాలరీస్‌ సలహాదారు డీఎన్‌ ప్రసాద్‌, సింగరేణి జీఎం కే రవిశంకర్‌, కార్యక్రమ కన్వీనర్‌ రమేశ్‌కుమార్‌, గౌరవ కార్యదర్శి టీ అంజయ్య, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.


logo