శనివారం 11 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 03:35:30

అయ్యో.. వినయ్‌.. ఎంత కష్టం

అయ్యో.. వినయ్‌.. ఎంత కష్టం

  • రోడ్డు ప్రమాదంలో స్పైనల్‌ కార్డు దెబ్బతిని వీల్‌చైర్‌కే పరిమితం
  • చికిత్స కోసం రూ.18 లక్షలు ఖర్చు 
  • ఉద్యోగం ఇప్పించాలని వేడుకోలు

అందరిలాగే తాను మంచి భవిష్యత్‌ కోసం కలలు గన్నాడు. చిన్ననాటి నుంచి చదువుల్లో రాణిస్తూ ఇంజినీరింగ్‌లో ప్రతిభ చూపాడు. ఉన్నత ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలవాలనుకున్నాడు. ఇంతలో అంతా తలకిందులైంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరేండ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. వయస్సుమీరుతున్న దశలో తమకు అండగా ఉంటాడని ఆశలు పెంచుకున్న ఆ తల్లిదండ్రులు.. కొడుకు దీనస్థితిని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.

- కోరుట్ల టౌన్‌

కోరుట్లలోని భీమునిదుబ్బ పోచమ్మగుడి సమీపంలో ఉంటున్న బోగ గణేశ్‌-సువర్ణ దంపతుల కుమారుడు వినయ్‌. చిన్ననాటి నుంచి చదువు ల్లో రాణించి మంచి ర్యాంకులు సాధించాడు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో 2014లో బీటెక్‌ పూర్తి చేశాడు. ఈసీఈ విభాగంలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటికి వచ్చిన వినయ్‌ తన అక్కను వారింట్లో దింపడానికి వెళ్లి వస్తున్న సమయంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయాడు. చికిత్సకోసం దవాఖానకు తరలించగా వెన్నుముకకు గాయమైందని, డీ6, డీ7 డిస్క్‌ నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తేల్చారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ దవాఖానకు తరలించి ఆపరేషన్‌ చేయించినా ఫలితం మాత్రం దక్కలేదు. చేసేదిలేక ఇంటికి తీసుకువచ్చారు. వినయ్‌ శస్త్రచికిత్స కోసం రూ. 18 లక్షలు ఖర్చు పెట్టిన తండ్రి అప్పులు తీర్చేందుకు గల్ఫ్‌ బాటపట్టాడు. ఆరేండ్లుగా నిస్సహాయస్థితిలో ఉన్న కొడుకు పరిస్థితిని చూసి కన్నతల్లి తల్లడిల్లిపోతున్నది. ప్రస్తుతం వినయ్‌ కొన్ని వ్యా యామాలు చేసి కొంతమేర విజయం సాధించాడు. వీల్‌చైర్‌ను ఆసరాగా చేసుకొని తల్లి సాయంతో చిన్నపాటి పనులు చేసుకోగలుగుతున్నాడు. 

ఉద్యోగం ఇప్పించి ఆదుకోరూ..

నా శరీరం నడుం పైభాగం వరకు పనిచేస్తుంది. కింది భా గం చచ్చుబడి పోవడంతో నడవలేకపోతున్నా. బీటెక్‌లో ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. ప్రభు త్వం ఏదైనా కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తే నాకున్న ప్రతిభతో వీల్‌చైర్‌లో కూర్చుని పని చేస్తా.    

- వినయ్‌
logo