శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 18:55:14

‘గ్రామాల వీధి దీపాలకు ఇక సరికొత్త వెలుగు జిలుగులు’

‘గ్రామాల వీధి దీపాలకు ఇక సరికొత్త వెలుగు జిలుగులు’

హైదరాబాద్ : రాష్ట్రంలోని పల్లెలు సరికొత్త వెలుగులతో విరజిల్లనున్నాయి. ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన విద్యుత్ దీపాలతో వీధి వీధిన కొత్త వెలుగు జిలుగులు సంతరించుకోనున్నాయి. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ (EESL) అనుబంధంతో చీకటిని పారదోలుతూ మిరుమిట్లు గొలిపే నూతన వెలుగులు గ్రామాలకు అందనున్నాయి.  అంతేకాదు విద్యుత్ ఆదాతో పాటు ఈఎంఐ సదుపాయం కూడా చేకూరనుంది. స్ట్రీట్ లైట్స్ తో స్టేట్ సెంటర్ కు అనుసంధానం చేయడం వల్ల నిర్వహణ సామర్థ్యం పెరగనుంది. 

ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఈఈఎస్ఎల్ గ్రామ పంచాయితీల మధ్య ఎల్ఈడీ వీధి దీపాల అమర్చే ఒప్పందం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు అమర్చి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ సంస్థ అయిన ‘ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ’  జిల్లా పంచాయతీ అధికారులు మధ్య తదనంతరం  ఒప్పందం చేసుకోనున్నది.


 ప్రస్తుత ఈ ఒప్పందాన్ని అనుసరించి ఈఈఎస్ఎల్ వారు నాణ్యమైన ఎల్ఈడీ లైట్లు, ఫిక్సర్ సమకూర్చి వాటిని వీధి స్తంభాలకు అమర్చి వాటిని పర్యవేక్షించే బాధ్యతను తీసుకుంటారు. దీని కోసం గ్రామ పంచాయతీలు వెంటనే ఎలాంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు. వీధి లైట్లు ఆమర్చిన తరువాత నెలసరి వాయిదాల్లో ఈఈఎస్ఎల్ కు చెల్లించవచ్చు.  ఈ వీధి దీపాలు నేషనల్ లైటింగ్ కోడ్ ప్రకారం ప్రకాశవంతమైన వెలుతురును ఇస్తాయి.

ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయడం ద్వారా చీకటి పడగానే లైట్లు వెలిగేలా, ఉదయం వెలుతురు రాగానే ఆగిపోయే విధంగా ఏర్పాటు చేస్తారు. దీంతో విద్యుత్ వృథాను అరికట్టవచ్చు. ఈ లైట్లలో కంప్యూటర్ చిప్ ను అమర్చడం ద్వారా దానిని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కంప్యూటర్ లో అనుసంధానించడంతో ఎక్కడైనా లైట్ ఆన్ చేయకపోతే వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలతో గ్రామాలు మరింత అభివృద్ధి చెంది, పల్లెలు మన రాష్ట్రానికి పట్టుగొమ్మలు గా మారుతున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఈఈఎస్ఎల్  ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సౌరబ్ కుమార్, పంచాయితీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తదితర ఆధికారులు పాల్గొన్నారు.


logo