బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 03:01:35

పల్లె ప్రదాతలు

పల్లె ప్రదాతలు

  • ఊరి రుణం తీర్చుకోవాలని పిలుపు 
  • విరాళాల సేకరణకు ఐక్య ఉద్యమం
  • నెలలో ఒకరోజు దాతలతో భేటీ 
  • ‘పల్లె ప్రగతి’ విరాళాలు 25 కోట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పుట్టినగడ్డ రుణం తీర్చుకొనే సమయం ఆసన్నమైంది. ఊరి ప్రగతికి చేయూతనిచ్చి కలలను సాకారం చేసుకొనే అవకాశం దక్కింది. పల్లె ప్రగతితో మొదలైన విరాళాల సేకరణ కార్యక్రమం ఉద్యమంగా మారి అప్రతిహతంగా కొనసాగుతున్నది. ‘మీ సొంతూళ్లను అభివృద్ధి చేసుకోండి’ అంటూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు ఎంతోమందిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నది. ‘సంపాదించిన మొత్తంలో కొంతైనా దానం చేయకపోతే లావైపోతాం’ అని ఆలోచించేలా చేస్తున్నది. ప్రస్తుతం ప్రణాళికాసైన్యం సైతం ఐక్యంగా నెలలో కనీసం ఒకరోజు దాతలను కలిసేందుకు సిద్ధమవుతున్నది. స్ఫూర్తి ప్రదాతలను చూపుతూ విరాళాలు సేకరించనున్నది.

ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవారు పుట్టిన ఊరికి ఎంతో కొంత సాయపడాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. పల్లె ప్రగతికి ముందే ఉన్నతాధికారులు, కొందరు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. పల్లెల అభివృద్ధి కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని సూచించారు. దేశ, విదేశాల్లో ఆర్థికంగా మంచిస్థితిలో ఉన్నవారిలో పుట్టిన ఊరి బాగు కు ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తిని నింపేందుకు గ్రామాల్లోని స్వచ్ఛంద సంస్థలు, వార్డు సభ్యులు, సర్పంచ్‌, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రణాళికా సైన్యం రంగంలోకి దిగుతున్నది. నెలలో కనీసం ఒక్కరోజైనా దాతలను కలిసేందుకు సిద్ధమవుతున్నది.

దాతృత్వంతో స్ఫూర్తి

దాతృత్వంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన కే నర్సింహారెడ్డి ముందున్నారు. పుట్టిన ఊరు అభివృద్ధికి ఆయన రూ.25 కోట్ల విరాళాన్ని ఇవ్వడం స్ఫూర్తినింపింది. అదే జిల్లాలోని భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌కు చెందిన భాస్కర్‌రావు రూ.2 కోట్ల విరాళం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన పల్లెప్రగతిలో భాగంగా చాలామంది తమ ఊరి అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చారు. రూ.5 వేలు మొదలు రూ.2 కోట్ల వరకు విరాళాలు ప్రకటించారు. పల్లె ప్రగతి ప్రణాళిక తొలివిడుతలో 11,032 మంది దాతలు రూ.25 కోట్లను విరాళంగా ఇచ్చారు. 12.6 ఎకరాల భూమిని దానంచేశారు. స్థానికంగా ఉండేవారు ఎక్కువగా భూదానం చేసేందుకు ముందుకొచ్చారు. డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికల కోసం భూమిని విరాళంగా ఇచ్చారు. కొన్నిచోట్ల విలువైన భూములు కూడా పంచాయతీలకు రాసిచ్చారు. 14 పంచాయతీల పరిధిలో పరిశుభ్రత కోసం 14 ట్రాక్టర్లను విరాళంగా అందజేశారు. మరో 10 ట్రాలీలు, 6,300 డస్ట్‌బిన్‌లు, హరితహారం మొక్కల సంరక్షణకు లక్ష ట్రీ గార్డులు కూడా విరాళంగా పంచాయతీలకు వచ్చాయి. 

దానం చేయండి.. పేర్లు పెట్టుకోండి

గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడుగా గ్రామస్థుల నుంచి, వ్యాపారులు, ఆర్థికంగా ఎదిగిన వారి నుంచి విరాళాలు సేకరించేందుకు గ్రామాల్లో సర్పంచ్‌లు ప్రణాళికలు సిద్ధంచేసుకున్నారు. ఇటీవల భారీగా విరాళాలు ఇచ్చిన నర్సింహారెడ్డి, భాస్కర్‌రావుతోపాటు పెద్ద హోదాల్లో ఉన్నవారిని స్ఫూర్తిగా చూపిస్తూ విరాళాలను సేకరించాలని భావిస్తున్నారు. గ్రామం నుంచి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందసంస్థలు, ప్రణాళికా సైన్యం.. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను కలుపుకొని అభివృద్ధి ప్రదాతల నుంచి విరాళాలు కోరనున్నారు. భారీగా విరాళాలు వచ్చే అవకాశాలు ఉంటే మంత్రులను సైతం తోడుగా రావాలని కోరుతున్నారు. గ్రామాభివృద్ధిని కాంక్షించే వారంతా కలిసి దాతల దగ్గరకు వెళ్లనున్నారు. ఈ ప్రక్రియతో గ్రామానికి నిధులొస్తాయని భావిస్తున్నారు. వారిచ్చే సహకారంతో చేసే పనులకు దాతలు చెప్పిన పేర్లను పెట్టనున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలకు దాతల పేర్లు పెట్టారు. కొన్ని రోడ్లను కూడా దాతల పేర్లతో పిలుస్తున్నారు. ఇది మరికొందరిలో స్ఫూర్తి నింపుతున్నది.


logo