మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 02:35:18

మీ ఆవులు ఇవ్వండి.. పాలు తీసుకోండి

మీ ఆవులు ఇవ్వండి.. పాలు తీసుకోండి

  • ఇక ఏ2 రకం పాల ఉత్పత్తి.. 
  • ‘విజయ’ డెయిరీ సన్నాహాలు
  • రాజేంద్రనగర్‌లో హాస్టల్‌.. 
  • ఆవులు లీజుకిచ్చే వారికి ప్రోత్సాహకం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మార్కెట్‌లో అత్యధిక ధర పలికే ఏ2 పాల ఉత్పత్తిపై తెలంగాణ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) దృష్టి సారించింది. వివిధ దేశాలలో అధిక ఆదరణ లభిస్తున్న ఈ పాలను రాష్ట్రంలో కూడా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ఆవుల నుంచి పాలు సేకరించేందుకు వీలుగా ప్రత్యేక హాస్టల్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. రాజేంద్రనగర్‌లోని తమ డెయిరీకి ఉన్న స్థలంలోనే ఇందుకోసం షెడ్లు, పశువులకు అవసరమైన మేతను అందుబాటులోకి తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు విజయ డెయిరీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రక్రియలో ఆసక్తి ఉన్న ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని విజయ డెయిరీ నిర్ణయించింది. ‘ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఆవులను కొని ఈ హాస్టల్‌కు ఇవ్వొచ్చు. వాటి పాలను విక్రయించగా వచ్చే మొత్తంలో నిర్వహణ ఖర్చులుపోను మిగిలిన లాభాన్ని ఆవు యజమానికి ఇచ్చేస్తారు. లాభం వద్దనుకునే వారికి అవసరాలకు సరిపడా ఏ2 పాలను ఇంటికి సరఫరా చేస్తారు’ అని విజయ డెయిరీ ఉన్నతాధికారి తెలిపారు. ఆవుల నిర్వహణ మొత్తం పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, విజయ డెయిరీలే చూసుకుంటాయి. ఎలాంటి అదనపు ఖర్చులు భరించాల్సిన అవసరం ఉండదు. తొలి విడుతలో 100 ఆవులతో ప్రయోగాత్మకంగా ఈ హాస్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. గిర్‌, సాహివాల్‌ మొదలైన దేశీయ ఆవుల నుంచి మాత్రమే ఏ2 పాలను సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ పాలు మార్కెట్‌లో లీటరుకు రూ. 170 నుంచి రూ. 200 వరకు ధర పలుకుతున్నాయి. త్వరగా జీర్ణమయ్యే ఏ2 పాలుఅన్ని రకాల పశువుల్లో ఏ1 పోషకాలు ఉంటాయి. ఆ పాలలో ఉండే కొన్ని రకాల ప్రొటీన్లు, లాక్టోజ్‌ వల్ల కొందరిలో అజీర్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొందరిలో గుండె జబ్బులు పెరుగుతాయన్న ప్రచారం కూడా ఉంది. ఏ1 పాలలో ఉండే బీటా కేసిన్‌ ప్రొటీన్లు ఏ2 పాలలో ఉండవు. సాధారణంగా అన్ని ఆవులు ఏ1, ఏ2 పాలను ఇస్తాయి. కానీ కొన్ని ఆవులు కేవలం ఏ2 పాలు మాత్రమే ఇస్తాయి. ఏ2 పాలను ఇచ్చే ఆవును జన్యు పరీక్షల ద్వారా గుర్తించడానికయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అందువల్లనే ఆ ఆవులు ఇచ్చేపాలకు అధిక ధర పలుకుతుంది. 


logo