మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 02:32:38

మార్కెట్‌లోకి విజయ ఐస్‌క్రీం

మార్కెట్‌లోకి విజయ ఐస్‌క్రీం

  • వెయ్యి డెయిరీలు ఏర్పాటు చేస్తాం: మంత్రి తలసాని
  • విజయ నాణ్యతకు మారుపేరు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలుగుయూనివర్సిటీ, జనవరి 26: ఐస్‌క్రీం ప్రియులకు శుభవార్త. ఇప్పటివరకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులకే పేరుగాంచిన విజయ డెయిరీ.. ఇప్పుడు ఐస్‌క్రీంను మార్కెట్‌లోకి తెచ్చింది. వినియోగదారులకు కొత్త రుచులను చూపించనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విజయ డెయిరీని సీఎం కేసీఆర్‌ చొరవతో సంస్కరణలు చేపట్టి లాభాల బాటలోకి తెచ్చేందుకు కృషి చేశారని పాడిపరిశ్రమ అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌ ప్రాంగణంలోని లలిత కళాతోరణం వేదికపై మంగళవారం విజయ డెయిరీ ఐస్‌క్రీమ్‌ను మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి తలసాని లాంఛనంగా ప్రారంభించారు. మార్కెట్‌లోకి విడుదలచేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పాల డిమాండ్‌ పెరుగడంతో ఐస్‌క్రీం ఉత్పత్తి విస్తరణ అవసరమని భావించినట్టు తెలిపారు. యువతకు ఉపాధి, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంతోపాటు సంస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి విజయ డెయిరీ కేంద్రాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్టు పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ విజయ డెయిరీకి మంచి ఆదరణ ఉన్నదని, డెయిరీని దేశంలో అగ్రస్థానానికి తీసుకెళ్లే కృషి జరుగుతున్నదని చెప్పారు. రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని, విధిగా విజయ డెయిరీకి పాలు పోసి లాభాలను అందుకోవాలని కోరారు. అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ విజయ ఉత్పత్తులు నాణ్యతకు మారుపేరని చెప్పారు.

ఐస్‌క్రీం ఉత్పత్తులు మార్కెట్‌లో సఫలీకృతం కావాలని ఆకాంక్షిచారు. హోంమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ.. నాణ్యతప్రమాణాలతో విజయ బ్రాండ్‌ ప్రజల మన్ననలు అందుకున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, నగర సీపీ అంజనీకుమార్‌, విజయ డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఉన్నతాధికారులు అనిత రాజేంద్ర, అర్వింద్‌కుమార్‌, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేశాయి.

VIDEOS

logo