ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 01:10:33

ఇంటికే విజయ పాలు

ఇంటికే విజయ పాలు

  • మొబైల్‌ ఔట్‌లెట్‌ సేవలు ప్రారంభం 
  • సబ్సిడీపై 15 వాహనాల పంపిణీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాలు, పాల ఉత్పత్తుల కోసం పొద్దున్నే పాలకేంద్రానికి పరుగులు తీయాల్సిన అవసరం ఇకపై ఉండదు. విజయ పాల ఉత్పత్తులు ఇంటి వద్దకే రానున్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌లో మొబైల్‌ ఔట్‌లెట్‌ సేవలను పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి, విజయ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ అలకుంట్ల సరస్వతితో కలిసి పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బుధవారం ప్రారంభించారు. లాలాపేటలోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో విజయడెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం మొదటివిడుతగా బ్యాటరీతో నడిచే 15 వాహనాల (మొబైల్‌ ఔట్‌లెట్స్‌)ను సబ్సిడీపై లబ్ధిదారులకు పంపిణీచేశారు. ప్రజాదరణ కలిగిన విజయ డెయిరీ ఉత్పత్తులను వినియోగదారుల ఇంటిముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం కొత్త ఔట్‌లెట్‌లను ఏర్పాటుచేస్తున్నామని తలసాని చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 100, ఉమ్మడి పది జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 10 చొప్పున మరో 100 బ్యాటరీతో నడిచే వాహనాల ద్వారా విజయ ఉత్పత్తుల విక్రయాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఒక్కో వాహనం విలువ రూ.2.25 లక్షలు కాగా.. డెయిరీ 30 శాతం, లబ్ధిదారుడు 70 శాతం భరిస్తున్నారని తెలిపారు.గతంలో రైతులు పాల బిల్లుల కోసం ఎదురుచూసేవారని, ప్రస్త్తు తం 24 గంటల్లో రైతుల ఖాతాల్లో బిల్లులు జమచేస్తున్నట్టు కార్పొరేషన్‌ చైర్మన్‌ భూమారెడ్డి తెలిపారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వం విజయ డెయిరీని అభివృద్ధి చేస్తుందన్నారు.


logo