మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 00:58:54

నాడు ఊళ్లకు ఊళ్లే ఖాళీ

నాడు ఊళ్లకు ఊళ్లే ఖాళీ

  • ఊరంతటా ఫ్లోరోసిస్‌ బాధితులే
  • మరోచోట వెళ్లి స్థిర నివాసాలు
  • రక్షిత మంచినీటితో కష్టాలకు చెక్‌
  • ప్రస్తుతం ప్రతిఇంటికీ కృష్ణాజలాలు

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఓ ఫ్యాక్టరీ.. లేదా ఏదైనా సాగునీటి ప్రాజెక్టు కొత్తగా వస్తే నిర్వాసితులు ఖాళీచేసి మరో చోటికి వెళ్లడం సహజం. కానీ తాగే గుక్కెడు నీరే గరళమైన ఫలితంగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నల్లగొండ జిల్లాలో ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతంగా పేరొందింది. ఆ ప్రాంతంలోని బట్లపల్లి అనే గ్రామంలో దాదాపు 250కి పైగా కుటుంబాలు నివాసం ఉండేవి. గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఫ్లోరైడ్‌ బాధితులే. చేతులు, కాళ్లు వంకర పోవడం.. విపరీతమైన కీళ్ల నొప్పులు.. చిన్న వయస్సులోనే నోట్లో పళ్లు గారలు పట్టడం.. నడివయస్సులోనే చేతికర్ర లేనిది అడుగు వేయలేకపోవడం వారి దీన స్థితి. ఈ రుగ్మతలకు అసలు కారణం ఏమిటో తెలియని అమాయక జనం చాలారోజులపాటు తమకు వస్తున్నది అంతుచిక్కని రోగమనే భావించేవారు. ఆ తర్వాత జరిపిన పలు పరిశోధనల్లో ఇక్కడి నీటిలో ఫ్లోరైడ్‌ ఉన్నట్టు వెల్లడైంది. గ్రామస్థులు బోర్లలో నీటిని తాగడం వల్ల వారికి ఫ్లోరోసిస్‌ వస్తున్నట్టు స్పష్టమైంది. అక్కడి నీటిని పరీక్షకు పంపితే 28 పీపీఎం ఫ్లోరైడ్‌ ఉన్నట్లు వెల్లడైంది. సాధారణంగా తాగునీటిలో 0.5 పీపీఎం నుంచి 1 పీపీఎం వరకు మాత్రమే ఫ్లోరైడ్‌ ఉండవచ్చు. ఈ కారణం తెలిసిన జనం గ్రామాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. ఎక్కువ మంది అక్కడి నుంచి మరో మూడు కిలోమీటర్ల దూరంలో నివాసాలు ఏర్పరుచుకుని ఆ గ్రామానికి కొత్త బట్లపల్లి అని పేరు పెట్టుకున్నారు. మరికొందరు వట్టిపల్లి గ్రామంలో ఇండ్లు కట్టుకున్నారు. బట్లపల్లి అనే గ్రామం కేవలం ఫ్లోరైడ్‌ భూతంతో కనుమరుగైంది. ఇదే మండలంలోని ఈదులగూడెం, పాకగూడెం గ్రామాలలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి భూగర్భజలాల్లోనూ భారీగా ఫ్లోరైడ్‌ ఉండడంతో వీరు కూడా దగ్గరలోని లెకంలపల్లి గ్రామానికి మకాం మార్చారు. కొందరు మర్రిగూడెం- చండూరు రహదారి సమీపంలో ఇండ్లు కట్టుకున్నారు. అప్పటి ప్రభుత్వాధినేతలు నెదర్లాండ్స్‌ నిధులతో ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్లు ఇచ్చే ప్రయత్నంచేశారు. అయితే ట్యాంకుల వరకే ఈ నీటిని చేర్చేవారు. కానీ అవి కూడా తాగడానికి అనువైనవిగా ఉండేవి కావు. ఫ్లోరోసిస్‌ బాధితుల వెతలు అప్పటి ఉద్యమనేత కేసీఆర్‌ దృష్టికి వచ్చాయి. దీంతో 2003లో కేసీఆర్‌ ఆ ప్రాంతంలో మూడు రోజులపాటు పర్యటించారు. మర్రిగూడెంలో బస చేసి బట్లపల్లివాసులతో భేటీ అయ్యారు. లెంకలపల్లిలో ఫ్లోరోసిస్‌ బాధితులను కలిసి వారి గోడును విని చలించిపోయారు. అక్కడి నుంచి సరంపేట, రాంరెడ్డిపల్లి మీదుగా కేసీఆర్‌ పర్యటన సాగింది. అప్పుడే మన రాష్ట్రం వస్తే.. ఈ నీళ్ల గోస తీరుతుందని ధైర్యంచెప్పారు. నాడు కేసీఆర్‌ చెప్పినట్లుగానే ప్రస్తుతం ఆ ప్రాంతానికి మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికి రక్షిత నీరు సరఫరా అవుతున్నది. ఫ్లోరైడ్‌ ప్రభావంతో ఖాళీ అయిన పాత బట్లపల్లి వద్దనే కృష్ణా వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటును నిర్మించారు. ఇప్పుడు కొత్త బట్లపల్లి ఊర్లోని 80ఇండ్లకు ఇంటింటికీ రోజుకు నాలుగు గంటలపాటు భగీరథ నీళ్లొస్తున్నాయి. బట్లపల్లికి గ్రామపంచాయతీ అయిన వట్టిపల్లిలోనూ 450 ఇండ్లకు ఇప్పుడు ప్రతి ఇంటికీ రక్షితనీరు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 

కేసీఆర్‌ పల్లెనిద్రతో బాధితుల కష్టాలు తెలుసుకుండు

సీఏం కేసీఆర్‌ నాడు ఉద్యమ నాయకుడిగా మర్రిగూడ మండలంలో రెండుసార్లు పర్యటించారు.  స్వయంగా ఫ్లోరైడ్‌ బాధితులతో మాట్లాడి వాళ్ల బాధలు తెలుసుకున్నారు. 2006లో మండల కేంద్రంలో పల్లెనిద్ర చేశారు. మండలంలోని చెర్లగూడెం చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే ఫ్లోరోసిస్‌ పీడిత మునుగోడుకు సాగు, తాగు నీరు అందించవచ్చని ఆలోచన చేశారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు చూసిన కారణంగా మిషన్‌భగీరథను నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. పనులు శరవేగంగా పూర్తిచేయడంతో ప్రస్తుతం అన్ని గ్రామాలకు మంచినీళ్లు అందుతున్నయి. 

- దంటు జగదీశ్వర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు


logo