సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 01:33:27

స్వచ్ఛ రాజకీయాలే పరమావధి కావాలి

స్వచ్ఛ రాజకీయాలే పరమావధి కావాలి

  • నైతిక విలువల పతనం దురదృష్టకరం 
  • పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినం చేయాలి
  • అటల్‌ స్మారకోపన్యాసంలో ఉపరాష్ట్రపతి 
  •  ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/కవాడిగూడ: ప్రజాజీవితంలో నైతిక విలువలు కోల్పోవడం బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా పతనం కాకముందే అన్ని పార్టీలు తమ సభ్యుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి స్మారకోపన్యాసంలో ఉపరాష్ట్రపతి ‘ప్రజాస్వామ్య ఏకాభిప్రాయ నిర్మా ణం- వాజపేయి మార్గం’ అనే అంశంపై ప్రసంగించారు. పీవీ నరసింహారావు మొదలు పెట్టిన ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసిన మహనీయుడు వాజపేయి అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, స్వచ్ఛ రాజకీయాలే పరమావధి కావాలని సూచించారు.

చట్టసభల్లో జరిగే చర్చల్లోనూ ప్రమాణాలు పెంచేలా, ఉత్తమ ప్రవర్తనను పెంపొందించేలా ప్రోత్సహించాలని చెప్పారు. అధికారం కోసం సిద్ధాంతాలను మరిచి, విలువలు లేని రాజకీయాలు చేయడం సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. నేరప్రవృత్తి కలిగినవారు రాజకీయాల్లోకి రావడం వల్ల హింస పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపుల వివాదాలను మూడు నెలల్లోనే విచారించేలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. స్వల్ప లబ్ధి కోసం తాత్కాలిక ప్రజాకర్షక పథకాలను పక్కనపెట్టి, దీర్ఘకాలిక అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. కులం, వర్గం, ధనం వంటివి వ్యవస్థను నడిపించడం మంచిది కాదని చెప్పారు.

భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రధానమంత్రిగా అటల్‌జీ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, ప్రతిమ ఫౌండేషన్‌ తరఫున బీ హరిణి, బీ ప్రతీక్‌, ఇండియా ఫౌండేషన్‌ బోర్డు ఆఫ్‌ గవర్నర్‌ సభ్యులు శౌర్య దోవల్‌, రాంమాధవ్‌, వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.


logo